ఏపీలో తాజాగా రెండు కీలక కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు మద్యం అక్రమాల కేసు, మరోవైపు గనుల దోపిడి ఆరోపణలతో సంబంధం ఉన్న ఇద్దరు వైసీపీ కీలక నేతలు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. మద్యం స్కాం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, గనుల అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు అజ్ఞాతంలో కలిసిపోయారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు.కసిరెడ్డి కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపిన సిట్ అధికారులు, అతని ఇంట్లో సోదాలు చేసినా స్పందన రాలేదు. కోర్టు విచారణకు హాజరుకావాలని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన బయటకే రాలేదు. ఈ వ్యవహారంపై విచారణకు సైతం ఆయన సహకరించలేదు. ప్రభుత్వమే ప్రత్యేకంగా నియమించిన సిట్ బృందం అతన్ని పట్టుకోలేకపోవడం విచిత్రంగా మారింది. ఇదే కేసులో విచారణకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… “అంతా కసిరెడ్డే!” అంటూ స్పష్టమైన ప్రకటన ఇవ్వడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.
ఇక గనుల కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారన్నదే పెద్ద ప్రశ్న. రూ.250 కోట్ల అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా లేకుండానే కాకాణి కనిపించకుండా పోవడంపై పోలీసుల నిష్క్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, నెల్లూరులో చేక్చేసినా తుదితీర్పు లేదు.ఈ క్రమంలోనే ఆయనను పట్టిస్తే రూ.25,000 బహుమతి ఇస్తానని సోమిరెడ్డి ప్రకటించారు. అధికార వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా? లేక వాళ్ళు నిజంగానే పరారీలో మ్యాజిక్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇకనైనా ఈ ఇద్దరిపై దృష్టి పెట్టి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ వివాదాలకు ముగింపు పలకాలని ప్రత్యర్ధులు కోరుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి.. ఎట్టకేలకు స్పందించాడు. అయితే, ప్రత్యక్షంగా కాకుండా.. ఓ ఆడియో సందేశం పంపి సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ రాజ్ తన ఆడియో మెసేజ్‌లో ఏం చెప్పాడు.. తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి క్లారిటీ ఇచ్చాడు.. అసలు అతను ఎక్కడ ఉన్నానన్నాడు.. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
లిక్కర్ స్కామ్‌లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి శనివారం నాడు ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. తనపై ఆరోపణలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన కామెంట్స్ చేశాడు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకు సిట్ బృందం ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా పోరాడుతున్నానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. తనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారని ఆడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లగా.. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారని కసిరెడ్డి పేర్కొన్నారు.మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి తేల్చి చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన న్యాయ పోరాటం పూర్తయిన తరువాత.. విజయసాయి రెడ్డి చరిత్ర బయటపెడతానని రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. మీడియా ప్రతినిధులందరినీ పిలిచి బట్టేబాజ్ విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం బయటపెడతానని చెప్పారు. ఒకవైపు వాదన విని కథనాలు రాయొద్దంటూ మీడియాను కోరారు రాజ్. తనపై అసత్య కథనాలు సరికాదని విజ్ఞప్తి చేశారు.
విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెంటనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజీనామా ప్రకటన ఒక విధంగా చెప్పాలంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనం సృష్టించింది. అదీ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకీ రాజీనామా చేఃసి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. రాజకీయం కాదు ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించడమే కాదు.. రైతుగా కొత్త అవతారమెత్తానంటూ సాగు మొదలెట్టేశారు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వ్యవసాయ వ్యాపకంతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.
అయితే నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా జగన్ కు జెల్ల కొట్టి రాజకీయాలకు దూరం కావడమేంటి? అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అనడానికి ఆయన రాజీనామా ప్రకటనకు ముందు వరకూ ఎవరిలోనూ సందేహం లేదు. అందుకే ఆయన రాజీనామా వెనుక కూడా ఏదైనా డ్రామా ఉందా? అన్న అనుమానాలు అప్పట్లో గట్టిగా వ్యక్తమయ్యాయి. అప్పట్లో అంటే విజయసాయి రాజీనామా ప్రకటన చేసిన సమయంలో అదంతా జగన్ వ్యూహంలో భాగమేనంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రాజీనామా జగన్ మోడీ, బీజేపీకి పంపిన ప్రేమ సందేశంగా కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టే విజయసాయి తన రాజీనామా ప్రకటన సమయంలో జగన్ పట్ల విశ్వానాన్నే వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనీ, ఆయన రాజకీయంగా పుంజుకోవాలనీ తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో విజయసాయి రాజీనామా జగన్ ఆదేశం మేరకే జరిగిందని అప్పట్లో అంతా భావించారు.
కానీ ఆ తరువాత వరుసగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్, విజయసాయి మధ్య పూడ్చలేని, పూడ్చడానికి వీలుకాని అగాధమేదో ఏర్పడిందని అంతా భావిస్తున్నారు. తన రాజీనామా ప్రకటన తరువాత ఆయన జగన్ సోదరి షర్మిలతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. గంటల పాటు జరిగిన ఆ భేటీలో షర్మిల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో గత నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ పరోక్షంగా జగన్ నే టార్గెట్ చేశాయి. ఆ సందర్భంగానే అసందర్భంగా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పటి వరకూ ఏపీలో లిక్కర్ కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చిన వైసీపీకి విజయసాయి రివీల్ చేసిన విషయం మింగుడుపడలేదు. అప్పుడే విజయఃసాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని చెప్పారు. అందుకు సంబంధించిన విషయాలు, వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం (ఏప్రిల్ 18) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్ కసిరెడ్డి గురించి సంచలన విషయాలు చెప్పారు.
రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్న విజయసాయిరెడ్డి అటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీలోని కొందరు నేతల ద్వారా రాజ్ కసిరెడ్డితో పరిచయం అయ్యిందనీ. అతడి గురించి తెలియని తాను పార్టీలో అతడి ఎదుగుదలకు దోహదపడ్డాననీ చెప్పుకొచ్చారు. భారీ మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి తనను మోసం చేశాడనీ, అయితే ఆ మోసం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ అన్న విజయసాయిరెడ్డి, వైసీపీ హయాంలో 2019 చివరిలో నూతన మద్యం విధాన రూపకల్పనకు తన హైదరాబాద్, విజయవాడ నివాసాలలో రెండు సమావేశాలు జరిగాయని చెప్పారు. ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, తాను ఉన్నామన్నారు ఈ సమావేశాల తరువాతే తాను రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు అడగడంతో అరబిందో శరత్ చంద్రారెడ్డి చేత వంద కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని తెలిపారు.
అది వినా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సిట్ విచారణలో కూడా ఇదే చెప్పానని, మద్యం విధానం రూపొందిన తొలి నాళ్లలోనే తాను పార్టీలో క్రియాశీలంగా ఉన్నాననీ, ఆ తరువాత ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదనీ చెప్పుకున్నారు. మద్యం కుంభకోణంలో ముడుపులు చేతులు మారాయా? ఎంతమేర అక్రమాలు జరిగాయి? అయితే విజయసాయి మీడియాతో మాట్లాడిన మాటలన్నీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి, మిధున్ రెడ్డిల పాత్రే కీలకమన్న విషయాన్ని పరోక్షంగా నిర్ధారించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా జగన్ సొంత మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది కూడా ఆయన జగన్ తో ఢీ అనడానికి రెఢీగా ఉన్నారన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు