కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెంగళూరు విమానాశ్రయంలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన రన్యా అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొంటోంది. నటి రన్యా రావు భర్త జతిన్ వి హుక్కేరి, ఆమె సవతి తండ్రి అయిన డీజీపీ పైనా విచారణ సాగనుందని కథనాలొచ్చాయి. అయితే రన్యారావు భర్త పై చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఎటువంటి బలవంతపు చర్యను ప్రారంభించవద్దని కర్ణాటక హైకోర్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)ని తాజా విచారణలో ఆదేశించింది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు తన భార్యపై నమోదైన కేసులో డిఆర్ఐ అరెస్టును నిరసిస్తూ జతిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ఏదైనా బలవంతపు చర్య తీసుకునే ముందు డిఆర్ఐ చట్టబద్ధమైన ప్రక్రియను పాటించాలని ఆదేశించాలని జతిన్ కోర్టును కోరారు. దీనిపై కోర్టు విచారించింది. నటి రన్యారావుపై వచ్చిన ఆరోపణలను ఆమె భర్తతో ముడిపెట్టలేమని జతిన్ తరపు న్యాయవాది వాదించారు. డిఆర్ఐ అతనికి సమన్లు జారీ చేసినప్పుడు, రెండుసార్లు విచారణకు తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన దర్యాప్తునకు సహకరించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని పాటించకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని లాయర్ వాదించారు.
న్యాయస్థానంలో చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా డిఆర్ఐ అధికారులు తనను పదే పదే విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నందున చట్టవిరుద్ధమైన విధానంపై తాను అసంతృప్తి చెంది హైకోర్టును ఆశ్రయించానని జతిన్ వాదనలు వినిపించారు. సమన్లు జారీ చేయకుండా అధికారులు చట్టవిరుద్ధంగా నిర్బంధించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నారని, తనను వేధిస్తున్నారని వాదించారు. భర్త జతిన్ కి రన్యారావుతో దీర్ఘకాలిక సంబంధాలేవీ లేవని, పెళ్లి తర్వాత బంధం మాత్రమే ఉందని కోర్టులో న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు పేరుతో తమకు అనుకూల ప్రకటనలు చేయించేందుకు డిఆర్ఐ జతిన్ ని వేధిస్తోందని అతడి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. పదే పదే మానసికంగా గాయం చేస్తున్నారని, వేధింపుల కారణంగా, పిటిషనర్ జతిన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికారణంగానే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది తెలిపారు.
బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు నటి రన్యా రావు ప్రత్యేక కోర్టులో హాజరైనపుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి విశ్వనాథ్ సి. గౌడర్ ఎదుట డీఆర్‌ఐ అధికారుల పర్యవేక్షణలో కోర్టుకు వచ్చిన రన్యాను చూసేందుకు కోర్టు హాలు కిక్కిరిసిపోయింది.డీఆర్‌ఐ కస్టడీలో మూడు రోజుల పాటు ఉన్న సమయంలో, శారీరకంగా లేదా మానసికంగా ఏమైనా వేధింపులకు గురయ్యారా అని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు కోర్టు హాలులో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రశాంతంగా కనిపించిన రన్యా ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.
డీఆర్‌ఐ అధికారులు తనను మాటలతో బెదిరించారని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని రన్యా రావు వాపోయింది.అధికారులు తనను శారీరకంగా ఏమీ చేయకపోయినా,విచారణ సమయంలో మాత్రం చాలా తీవ్రంగా మాటలతో బెదిరించారని న్యాయమూర్తి ఎదుట రన్యా వెల్లడించింది. తాము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టినట్లు రన్యా కోర్టుకు విన్నవించుకుంది.
అయితే, డీఆర్‌ఐ అధికారి వెంటనే స్పందించి, రన్యా విచారణను వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వాదించారు.విచారణలో ప్రతి క్షణం వీడియో రికార్డింగ్ చేయబడిందని చెప్పిన డీఆర్ఐ అధికారి.. ఆమె తరచూ విదేశాలకు వెళ్తున్న విషయం నిజమే అని చెప్పారు. దాని ఆధారంగానే తాము ప్రశ్నలు వేసినట్లు జడ్జికి తెలిపారు. కానీ ఆమె విచారణకు సహకరించడం లేదని ప్రయాణ చరిత్ర వంటి పత్రాలు చూపిస్తున్నప్పటికీ, ఆమె సహకరించడానికి నిరాకరిస్తున్నారనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు డీఆర్ఐ అధికారి.
దీనిపై రన్యా వెంటనే స్పందిస్తూ, తాను విచారణ సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నానని అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి గౌడర్, రన్యాతో మాట్లాడుతూ, న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు వింటుందని,ఒకవైపు వాదనలు మాత్రమే విని కోర్టు ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాదని గుర్తుచేశారు.విచారణకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని జస్టిస్ విశ్వనాథ్ గౌడర్ తెలిపారు. ఒకవేళ బలవంతంగా లేదా బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నట్టు ఏమైనా ఆధారాలు లభిస్తే, కోర్టు తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.