భారతదేశపు దిగ్గజ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతా మూర్తి రతన్ టాటా గత సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా రాసినటువంటి వీలునామా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేల కోట్ల సామ్రాజ్యాధిపతి అయిన రతన్ టాటా మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి అని ఆయన వీలునామాను బట్టి అర్థమవుతుంది.టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా… వృద్ధాప్య సమస్యలతో గత ఏడాది అక్టోబరు 9న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి… పట్టుదల, క్రమశిక్షణతో పారిశ్రామిక దిగ్గజంగా, అపర కుబేరుడిగా మారిన రతన్ టాటా(Ratan Tata) యొక్క జీవితం ఎంతో మందికి స్పూర్తి, ఆదర్శప్రాయం కూడా. అంతేకాదు తాను సంపాదించిన దాంట్లో సింహభాగం దాతృత్వానికి కేటాయించడం… సామాజిక కార్యక్రమాల్లో టాటా సంస్థ యొక్క భాగస్వామ్యం… మరే ఇతర కార్పోరేట్ కంపెనీలకు కూడా సాధ్యం కాదు అంటే అతిశయోక్తి కాదు. అలాగే టాటా సంస్థ ఉద్యోగులను కూడా కంపెనీలో భాగస్వామ్యులను చేయడం… కోవిడ్ మహమ్మారి బారిన పడి చనిపోయిన టాటా సంస్థ ఉద్యోగుల కుటుంబాలకు రిటైర్మెంట్ వరకు జీతం చెల్లిస్తూ తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రపంచంలో రతన్ టాటాలో(Ratan Tata) యొక్క దాన గుణాన్ని చాటి చెప్పింది. తాజాగా బయటపడిన ఆస్తుల వీలునామాలు చూస్తే… దివంగత రతన్ టాటాను కలియుగ దాన కర్ణుడిగా అభివర్ణించిన అతిశయోక్తి లేదనిపిస్తోంది.
దివంగత రతన్ టాటా(Ratan Tata)కు ఉన్న రూ.3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు వ్యాపార దిగ్గజం రతన్ టాటా. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. రూ.3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు.తనకున్న రూ.3,800 కోట్ల ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా(Ratan Tata) ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులూ ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు.
బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటితో కలిపి మొత్తం రూ.800 కోట్ల ఆస్తుల్లో మూడో వంతును తన సవతి తల్లి కుమార్తెలు షిరీన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయికి రతన్ టాటా ఇచ్చారు.రూ.800 కోట్లలోని మూడో వంతును టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు.ముంబయి జుహూలోని భవనంలో వాటా, వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలను తన సోదరుడైన 82 ఏళ్ల జిమ్మీ నావల్ టాటాకు రాసిచ్చారు.తన ప్రాణ స్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్‌లోని ఇంటిని, మూడు తుపాకులను ఇచ్చారు.రతన్ టాటాకు పెంపుడు జంతువులంటే ప్రాణం. అది ఆయన వీలునామాలో కనిపించింది. తన పెంపుడు జంతువుల కోసం ఆయన రూ.12 లక్షలను కేటాయించారు. తద్వారా ఒక్కో పెంపుడు జంతువుకు 3 నెలలకోసారి రూ.30,000 అందుతాయి.తాను ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తూ వీలునామాలో రాశారు. తనవద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పని చేసిన శంతను నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు.తన పొరుగింటి వ్యక్తి జేక్ మాలైట్‌కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్నీ రతన్ మాఫీ చేశారు.వీలునామాలో తాను వ్యక్తిగతంగా సేకరించిన లగ్జరీ వాచీలను రతన్ టాటా పేర్కొన్నారు. ఆయనకు 65 వాచీలున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన కంపెనీల కలెక్షన్స్ ఉన్నాయి.
తన వీలునామాను అమలు చేసే బాధ్యతను న్యాయవాది డేరియస్ కంబట్టా, స్నేహితుడు మెహ్లీ మిస్త్రీ, సోదరీమణులు షిరీన్, డియాన్నాలకు రతన్ టాటా అప్పగించారు. దీనితో వారు బాంబే హైకోర్టులో ఇప్పటికే ‘ప్రొబేట్’ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రొబేట్ అంటే చనిపోయిన వ్యక్తి వీలునామాను వాలిడేట్ చేసే ప్రక్రియ. దీనితోపాటు ఆస్తులను వీలునామా ప్రకారం పంచడానికి అమలు చేసే వారికి అనుమతి ఇవ్వడం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుంది.కోర్టుకు అందించిన పత్రాల ప్రకారం.. రతన్ టాటాకు(Ratan Tata) విదేశాల్లో రూ.40 కోట్ల ఆస్తులున్నాయి. సీషెల్స్‌లో భూములు, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీల్లో బ్యాంకు ఖాతాలు, ఆల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్‌లో వాటాలు ఇందులో ఉన్నాయి. సీషెల్స్‌లోని భూమిని సింగపూర్ లోని ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్‌కు ఇవ్వాలని వీలునామాలో రతన్ టాటా రాశారు. ఆ సంస్థ తమ వ్యాపారంలో సహకారం అందించిందని పేర్కొన్నారు. ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ ఇండియా, ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్ సింగపూర్ కు చెందిన ఆర్ వెంకట్రామన్, పాట్రిక్ మెక్ గోల్డ్‌రిక్ ల ప్రయోజనాలను కాపాడాలని వీలునామాలో సూచించారు.