టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ తన కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. తన పిల్లలకు సినిమాల్లో ఓ స్థిరమైన భవిష్యత్తు ఉండాలని ఇప్పటికే ఒక ట్రాక్ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే తన కుమారుడు మహాధన్ “రాజా ది గ్రేట్” సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యాడు. అతను త్వరలో డైరెక్షన్ వైపు అడుగులు వేయబోతున్నాడని టాక్. సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుల వద్ద వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా రవి తేజ కుమార్తె మోక్షద కూడా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మోక్షద రవి తేజ తన మొదటి ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా హ్యాండిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యువ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనుండగా, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఫేమ్ వినోద్ అనంతోజు దర్శకత్వం వహించనున్నాడు. ఇదే కాంబినేషన్‌కు గతంలో మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, ఈ సారి మరింత కంటెంట్‌తో ముందుకు రావాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌తో మోక్షద ప్రొడక్షన్ పని తత్వాన్ని బాగా నేర్చుకునే అవకాశముంటుందని భావిస్తున్నారు. రవి తేజ ఇప్పటికే తన పేరుతో RT వర్క్స్ అని ఓ ప్రొడక్షన్ హౌస్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థను ప్రొఫెషనల్ లెవెల్‌లో తీసుకెళ్లేందుకు మోక్షదను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి ప్రాజెక్ట్‌లోనే ఓ క్రియేటివ్ టీమ్‌తో కలిసి పని చేయడం వల్ల మోక్షదకు మంచి అనుభవం లభిస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలా ఉండగా, మోక్షద గత కొంతకాలంగా ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఆసక్తిగా ఉండడంతో, రవి తేజ ఆమెకు మరింత ప్రాక్టికల్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆమెను ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో రవి తేజ ప్రొడక్షన్ సంస్థను పూర్తిగా మోక్షద చూసుకునే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేకపోయినా, ప్రాజెక్ట్ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. త్వరలోనే మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రవి తేజ ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. మరి తండ్రి బాటలో కూతురు ఎలా రాణిస్తుందో చూడాలి.