మీరు కారు, బైకు ఇలా ఏ వాహనం నడపాలన్నా ముఖ్యంగా ఉండాల్సినవి ఆ వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్తో పాటు ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో జారీ చేస్తారు. ఈ గడువు ముగిసేలోగా రెన్యూవల్ చేసుకోవాలి. గడువు ముగిసిన 30 రోజుల్లో రెన్యువల్ చేసుకోకుంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసి చాలా రోజులైతే జరిమానాతో పాటు మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి కొత్త లైసెన్స్ మాదిరిగా పరీక్షలు ఎదుర్కోవాల్సిందే.
అందుకే డ్రైవింగ్ లైసెన్సుపై గడువును చూసుకుని రెన్యూవల్ చేసుకోవడం మంచి పద్ధతి. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి డ్రైవింగ్ లైసెన్సు సంబంధిత సేవల్లో డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్‌పై క్లిక్ చేయాలి.పేజీ లోడ్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి.ఇప్పుడు రెన్యువల్ ఆఫ్ లైసెన్సును ఎంచుకుని GO పై క్లిక్ చేయాలి.తర్వాత డ్రైవింగ్ లైసెన్సు నెంబరు, జారీ చేసిన ఆర్టీఏ కార్యాలయం, పుట్టిన తేదీ, సెల్‌ఫోన్ నంబరు, క్యాప్చా వంటి వివరాలను నమోదు చేయాలి.రిక్వెస్ట్ ఓటీపీపై నొక్కితే మీ సెల్‌ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేస్తే మన వివరాలు కనిపిస్తాయి. వీటిని పరిశీలించాకా కన్ఫాంపై క్లిక్ చేసి, సేవ్ను నొక్కితే మన వివరాలు సేవ్ అవుతాయి.వచ్చిన విండోలో స్లాట్ కోసం మనకు నచ్చిన తేదీ, సమయాలను ఎంచుకుని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.ఇప్పుడు మనం చెల్లించాల్సిన రుసుం మొత్తాన్ని పరిశీలించి పే నౌపై క్లిక్ చేస్తే వచ్చిన పేమెంట్ ఆప్షన్లలో మనకు అనువైన దానిని ఎంచుకుని పే చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ వస్తుంది. వీటిని ప్రింట్ తీసుకోవాలి.మెడికల్ ఫిట్‌నెట్ సర్టిఫికెట్‌ను వైద్యాధికారితో సంతకం చేయించి, ఆధార్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సును స్లాట్ బుక్ అయిన రోజున ఆర్టీఏ కార్యాలయంలో అందజేస్తే కొద్ది రోజుల్లోనే రెన్యూవల్ అయిన డ్రైవింగ్ లైసెన్సు వస్తుంది.