టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు బెస్ట్ టైమ్ నడుస్తోంది. దశాబ్దంన్నరకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు చూసిన హిట్‌మ్యాన్.. గత ఏడాదిన్నర నుంచి ట్రోఫీల మీద ట్రోఫీలు సొంతం చేసుకుంటున్నాడు. తొలుత టీ20 వరల్డ్ కప్-2024ని దక్కించుకున్నాడు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ-2025ని ఒడిసిపట్టి తన కెరీర్‌ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. ఫుల్ జోష్‌లో ఉన్న హిట్‌మ్యాన్.. తన ఫ్యూచర్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. అప్పటివరకు ఆగే ప్రసక్తే లేదని.. ఆడుతూ ఉంటానని తేల్చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..
వన్డే ప్రపంచ కప్-2027లో ఆడతానని పక్కా చెప్పలేను. కానీ ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేను. నా ఆటతీరు ఎలా ఉందనే దాన్ని బట్టే అన్నీ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం నేను చాలా బాగా ఆడుతున్నా. గేమ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. టీమ్‌తో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. ఇతర ఆటగాళ్లు కూడా నా సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు. వరల్డ్ కప్-2027కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని రోహిత్ స్పష్టం చేశాడు.
ప్రత్యేకమైన గోల్స్ అంటూ ఏమీ లేవని.. కానీ ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కొనసాగాలనేది తన టార్గెట్ అన్నాడు రోహిత్. స్పెషల్‌గా ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకోలేదని.. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందన్నాడు హిట్‌మ్యాన్. వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చాడు భారత సారథి. రిటైర్మెంట్‌కు సంబంధించి దయచేసి ఎలాంటి రూమర్లు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు రోహిత్. ప్రస్తుత భారత జట్టు అద్భుతంగా ఆడుతోందని.. ఈ టీమ్‌ను వదిలి పెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నాడు.