చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలని ముందుకు సాగుతున్నారని జనసేన నేత సామినేని ఉదయభాను అన్నారు. తన మీద పవన్ కల్యాణ్ పెట్టిన నమ్మకం నిలబెట్టేలా పని చేస్తానని చెప్పారు. కూటమి పార్టీల నేతల మధ్య ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జన్మోహన్ రెడ్డి తాను పూర్తిగా మారిపోయానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి వచ్చే జగన్ 2.0 వేరుగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల కోసం తాను ఏం చేస్తానో చూపిస్తానని అన్నారు. గతంలో పార్టీ శ్రేణులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని… జగన్ 1.0లో కార్యకర్తలకు గొప్పగా ఏం చేయలేకపోయానని తెలిపారు. జగన్ 2.0పై జనసేన నేత సామినేని ఉదయభాను మాట్లాడారు. జగన్ 2.0 వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్వర్యంలో ఈనెల16న జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు వస్తారని చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ(సోమవారం) జనసేన నేతలు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఈనెల 16వ తేదీన సమావేశంలో పాల్గొంటారన్నారు. నాగబాబు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు ఈ సమావేశానికి అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
ప్లీనరీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను తరువాత తాము ఆచరిస్తామన్నారు. ఈ సంసదర్భంగా సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. పంచాయతీ రాజ్ శాఖ పని తీరు ద్వారా దేశంలోనే ఏపీకి గుర్తింపు తెచ్చిన ఘనత పవన్ కల్యాణ్‌దని తెలిపారు. చంద్రబాబు సహకారంతో గతంలో ఎవరూ చేయని విధంగా పనులు చేసి చూపారని అన్నారు. సర్పంచ్‌లకు నిధులు ఇచ్చి వారికి ఒక గౌరవం తెచ్చారన్నారు. గత జగన్ ప్రభుత్వంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పట్టించుకోలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి వారం వారం నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. నేడు సర్పంచ్‌లు అందరూ పవన్ పని తీరుకు అభినందనలు చెబుతున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేనను ప్రజలకు మరింత చేరువ చేస్తామని అన్నారు.చాలామంది వైసీపీ నాయకులు జనసేనలోకి చేరేందుకు వస్తున్నారని తెలిపారు. తనకు ఉన్న అనుభవం, పరిచయాల ద్వారా పార్టీని బలోపేతం చేస్తామన్నారు
తన మీద పవన్ కల్యాణ్ పెట్టిన నమ్మకం నిలబెట్టేలా పని చేస్తానని చెప్పారు. కూటమి పార్టీల నేతల మధ్య ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇద్దరు కలిసి రాష్ట్రం కోసం పని చేస్తున్నారన్నారు. కార్యకర్తల మధ్య అక్కడక్కడ అభిప్రాయ బేధాలు ఉంటే సరి చేస్తామని తెలిపారు. వైసీపీ నుంచి చాలామంది జనసేనలోకి వస్తాం అంటున్నారని చెప్పారు. ఆయా నియోజకవర్గ నాయకులతో మాట్లాడి చేరికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పవన్ కల్యాణ్ చాలా కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు, అనుమతులు రావాల్సిన అంశాలు ఉంటాయన్నారు. అటువంటి కారణాల వల్ల కీలక ఫైల్స్ కొంత ఆలస్యం కావడం సహజమని చెప్పుకొచ్చారు. పవన్ పని తీరును చూసి అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆనాడు ప్రజారాజ్యం కోసం పని చేసిన వారు చాలామంది జనసేనలోకి వచ్చారని గుర్తుచేశారు. చిరంజీవి ఒక వేడుకలో మాట్లాడిన మాటలను వక్రీకరణ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలని ముందుకు సాగుతున్నారన్నారు. కిరణ్ రాయల్ వ్యవహారంపై తమ పార్టీ పరంగా విచారణ జరుగుతుందన్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. తనకు తెలిసి కిరణ్ రాయల్‌పై కుట్రతోనే ఈ అభియోగాలు మోపారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయని సామినేని ఉదయభాను పేర్కొన్నారు.