స్టార్ హీరోయిన్లకు ధీటైన అందం, ఆకర్షణ తన సొంతం అయినా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె ఇంకా సినీ ఆరంగేట్రం చేయకపోవడంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. సారా టెండూల్కర్ ప్రస్తుతం మోడలింగ్ లో రాణిస్తున్నారు. సారా నటించిన వాణిజ్య ప్రకటనలు చూశాక అభిమానులు తనను ఒక స్టార్ గా ఆరాధిస్తున్నారు. కానీ సారా టెండూల్కర్ మాత్రం సినీ ఎంట్రీపై ఎలాంటి అప్ డేట్ చెప్పడం లేదు. సారా అలీఖాన్, జాన్వీ కపూర్ సహా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లతో సారా టెండూల్కర్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ వారి ప్రభావం సారా టెండూల్కర్ పై పడలేదా? అంటూ విస్మయం వ్యక్తం చేస్తోంది యూత్.
ఇదిలా ఉండగానే.. సారా టెండూల్కర్ గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో ఫ్రాంచైజీ యజమానిగా మారింది. సారా ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. జెట్‌సింథసిస్ ఆధారిత గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (GEPL)లో ముంబై ఫ్రాంచైజీతో వ్యాపార రంగంలో తన ముద్ర వేయబోతున్నారు. ఇది 300 మిలియన్లకు పైగా లైఫ్ టైమ్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18 వంటి యాప్ లు దీనిని ప్రమోట్ చేస్తున్నాయి. అయితే సారా టెండూల్కర్ లాంటి ప్రభావవంతమైన సెలబ్రిటీ ఇలాంటి ఇ-క్రికెట్ ని ప్రోత్సహించడం ద్వారా సినీరంగానికి అన్యాయం చేస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ సహా పలు టోర్నమెంట్‌ల కారణంగా థియేటర్లకు వచ్చి సినిమాలు వీక్షించే ఆడియెన్ తగ్గిపోతున్నారు. క్రికెట్ సీజన్లలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉందనే ఆవేదన ఎగ్జిబిటర్లలో ఉంది. కానీ ఇప్పుడు వీడియో ఆధారిత ఇ-క్రికెట్ కి సారా టెండూల్కర్ మద్ధతు పలకడం సరికాదనే అభిప్రాయం ఉంది. ఇలాంటి ప్రభావవంతమైన సెలబ్రిటీలు వీటిని ప్రమోట్ చేయడం ద్వారా నిజమైన వినోద రంగం అయిన సినీరంగం పై దాని ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనం థియేటర్లకు రావడం లేదు. పెరిగిన టికెట్ ధర కారణంగా కుటుంబాలు ఇంటికే పరిమితమయ్యాయి. ఓటీటీలు, డిజిటల్ వేదికలు సినీరంగానికి సవాల్ గా మారాయి. దీనికి ఇ-క్రికెట్ ప్రోత్సాహకం మరింత నష్టం చేకూరుస్తుంది.