‘సారంగపాణి జాతకం’ మూవీ రివ్యూ నటీనటులు: ప్రియదర్శి-రూప కొడవయూర్-వెన్నెల కిషోర్-నరేష్-అవసరాల శ్రీనివాస్-హర్ష చెముడు-తనికెళ్ల భరణి-శివన్నారాయణ-రాజా చెంబోలు-వడ్లమాని శ్రీనివాస్-ప్రదీప్ రుద్ర తదితరులు సంగీతం: వివేక్ సాగర్ ఛాయాగ్రహణం: పి.జి.విందా నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ రచన-దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగులో తెలుగుదనంతో సినిమాలు తీసే.. మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ఓవైపు కమెడియన్ గా రాణిస్తూనే.. మరోవైపు కథానాయకుడిగానూ మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించిన చిత్రం.. సారంగపాణి జాతకం. చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: సారంగపాణి ఒక కార్ షోరూంలో సేల్స్ మన్. తనకు ఆఫీసులో మంచి పేరుంటుంది. అతను ఎంతో ఇష్టపడే మైథిలి తనే వచ్చి సారంగపాణికి ఐలవ్యూ చెబుతుంది. దీంతో అతను గాల్లో తేలిపోతాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి పెళ్లికి రంగం సిద్ధమవుతుంది. కానీ జాతకాల పిచ్చి ఉన్న సారంగపాణి.. ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటతో పెళ్లికి బ్రేక్ వేసేస్తాడు. తానొక హత్య చేస్తానని చేతి రేఖలో ఉందని నమ్మి దానికి తనొక పరిష్కార మార్గం ఎంచుకుంటాడు. ఆ మార్గంలో వెళ్లేసరికి అతడికి లేని పోని సమస్యలు మొదలవుతాయి. ఇంతకీ అతను ఎంచుకున్న ఆ మార్గం ఏంటి.. అందులో అతను అనుకున్నది సాధించాడా.. చివరికి మైథిలితో అతడి పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ‘సారంగపాణి’లో కీలకమైన ఓ పాత్ర పేరు.. అహోబిలం. ఆయన నడిపే హోటల్ పేరు.. ‘అహోటల్’. ఆ అహోబిలాన్ని టెర్రస్ మీది నుంచి తోసి చంపేయమని హీరోకు చెబుతూ.. ”అదిగో అహో..బిలంలో పడ్డానికి రెడీగా ఉన్నాడు” అంటుంది ఓ పాత్ర. ‘సారంగపాణి జాతకం’లో ఇంద్రగంటి మోహనకృష్ణ చమత్కారం ఎలా ఉంటుందో చెప్పానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు ఎంత అందమైన.. అద్భుతమైన భాషో.. దాని మీద పట్టుంటే మాటలతో ఎంత గారడీ చేయొచ్చో చెప్పడానికి ‘సారంగపాణి జాతకం’ ఓ గొప్ప ఉదాహరణ. ఐతే కానీ ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఆ మాటల గారడీ మాత్రమే కావడమే ప్రతికూలాంశం. కథలో కూడా బలమైన విషయం ఉండి.. ప్రేక్షకుడి అంచనాకు అందని కథనం తోడై ఉంటే.. ‘సారంగపాణి జాతకం’ చాలా ప్రత్యేకమైన సినిమా అయ్యుండేది. చాలా చిన్న పాయింట్ పట్టుకుని మరీ సాగదీయడం వల్ల ఈ సినిమా పూర్తి సంతృప్తినివ్వదు. కానీ కథాకథనాల సంగతి వదిలేసి.. ఏమాత్రం అసభ్యత లేకుండా.. పూర్తిగా తెలుగుదనంతో కూడా కూడిన చక్కటి హాస్య సన్నివేశాలు చూడాలనుకుంటే మాత్రం ‘సారంగపాణి జాతకం’ మంచి ఛాయిస్.
‘సారంగపాణి జాతకం’ అని టైటిల్ పెట్టి.. హీరోను జాతకాల పిచ్చోడిగా చూపించారంటేనే.. ఈ కథ ఎలా సాగొచ్చు అన్నదానిపై ఒక అంచనా వచ్చేస్తుంది. జాతకాల మీద అతి నమ్మకంతో లేని పోని కష్టాలు కొని తెచ్చుకుని.. చివరికి లెంపలేసుకోవడంతో ఈ కథకు శుభం కార్డు పడుతుందని ఈజీగా చెప్పేయొచ్చు. ఈ అంచనాకు భిన్నంగా ఏమీ కథను నడిపించలేదు ఇంద్రగంటి మోహనకృష్ణ. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని జాతకాల పిచ్చితో హీరో నరకప్రాయం చేసుకుంటుంటే.. చూడ్డానికి చికాగ్గానే అనిపిస్తుంది. కానీ పాత్రల తాలూకు ఈ మూర్ఖత్వాన్నే ఆసరాగా చేసుకుని కామెడీ పండించడానికి అవకాశముంటుంది. ఇంద్రగంటి అదే చేశాడు. తన జాతకంలో హత్య చేసే రేఖ ఉందని.. తనకు తానుగా ఓ దుష్టసంహారం చేసి ఈ సమస్య నుంచి బయటపడాలని హీరో చేసే ప్రయత్నాలు ఫన్నీగా అనిపిస్తాయి. తన జాతకంలో ఉన్న దోషాన్ని కవర్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడలు.. అవి బెడిసికొట్టి అతను పడే పాట్ల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి. ఐతే ఒక దశ దాటాక హీరో ప్రవర్తన శ్రుతి మించడం.. అతడి మూర్ఖత్వం పరాకాష్టకు చేరడంతో ప్రేక్షకులకు ఉక్కపోత తప్పదు. ద్వితీయార్ధంలో సన్నివేశాలు మరీ సిల్లీగా.. ఇల్లాజికల్ గా సాగుతాయి. అక్కడక్కడా కామెడీ పండినా సరే.. సన్నివేశాలు లాజిక్ కు మరీ దూరంగా సాగడంతో ద్వితీయార్ధంలో కామెడీ అనుకున్నంతగా పండలేదు. ప్రతి సన్నివేశంలోనూ సంభాషణల్లో చాతుర్యానికి లోటు లేకపోయినా.. ఒక జోక్ అర్థం చేసుకునేలోపే ఇంకో జోక్ వచ్చి పడుతున్నా.. కథ మాత్రం మరీ రొటీన్ గా.. కొంత కృత్రిమంగానూ తయారై.. లాజిక్ పూర్తిగా కొండెక్కేయడంతో ఇబ్బంది తప్పదు. చివరి అరగంటలో ముఖ్య పాత్రలన్నింటినీ ఒక చోటికి తెచ్చేసి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో నవ్వించడానికి ఇంద్రగంటి ప్రయత్నించాడు. కొంత నవ్వుకున్నప్పటికీ.. తెరంతా మరీ కంగాళీగా తయారై మిశ్రమానుభూతి కలుగుతుంది. కథలోని ట్విస్టును.. ముగింపును ఊహించడం కష్టమేమీ కాదు. ముందే చెప్పుకున్నట్లు ఇందులో ఇంద్రగంటి సంభాషణల చాతుర్యం మాత్రం వేరే లెవెల్. ఆస్వాదించిన వాడికి ఆస్వాదించినంత అన్నట్లుంటాయి డైలాగులు. కామెడీ పేలిపోయే స్థాయిలో లేదు కానీ.. ఓ మోస్తరుగా నవ్వులు పండాయి. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేయగలిగే క్లీన్ కామెడీతో సినిమా సాగడం ప్లస్. కథాకథనాలు బలహీనమైనప్పటికీ.. ఇది ఓసారి చూడ్డానికి ఢోకా లేని టైంపాస్ కామెడీనే.
నటీనటులు: ప్రియదర్శి రూపంలో ప్రధాన పాత్రకు సరైన నటుడినే ఎంచుకున్నాడు ఇంద్రగంటి. పాత్రను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా బాగా నటించాడు ప్రియదర్శి. తన ఫిల్మోగ్రఫీలో ఇది మరో ప్రత్యేకమైన పాత్ర అని చెప్పొచ్చు. స్వతహాగా కమెడియన్ కాబట్టి.. కామెడీ టచ్ ఉన్న పాత్ర చేయడంలో అతనేమీ ఇబ్బంది పడలేదు. రూప కొడవయూర్ కూడా బాగా చేసింది. ఇంద్రగంటి మార్కు హీరోయిన్ పాత్రలో ఆమె సులువుగా ఒదిగిపోయింది. హీరోతో సమానమైన స్క్రీన్ టైం ఉన్న పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. ఈ మధ్య కాలంలో కిషోర్ బాగా నవ్వించిన పాత్రల్లో ఇదొకటి. అవసరాల శ్రీనివాస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాణించాడు. తనికెళ్ల భరణి కనిపించిన కాసేపు తన ప్రత్యేకతను చాటుకున్నారు. నరేష్.. వడ్డమాని శ్రీనివాస్.. హర్ష చెముడు.. వీళ్లంతా కామెడీ విషయంలో తలో చేయి వేశారు. రాజా చెంబోలుది మామూలు పాత్రే. సాంకేతిక వర్గం: వివేక్ సాగర్ రెండు పాటల్లో తన ముద్రను చూపించాడు. ‘సారంగా..’ పాట వినసొంపుగా.. హుషారుగా సాగింది. ఇంకో పాట కూడా బాగుంది. ఐతే పాటలకు అంత ప్రాధాన్యమున్న కథ కాదిది. వివేక్ నేపథ్య సంగీతం సినిమా శైలికి తగ్గట్లుగా సాగింది. పి.జి.విందా విజువల్స్ కంటికి ఇంపుగా కనిపిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా రిచ్ గా తీశారు నిర్మాత. ఇక ఇంద్రగంటి కథా రచయితగా నిరాశపరిచినా.. సంభాషణల్లో మాత్రం మెరుపులు మెరిపించాడు. ”వాడు ఆల్ఫా మేల్ ఏంటమ్మా.. అల్పుడైతేనూ”.. లాంటి చమక్కులు సినిమాలో బోలెడున్నాయి. మనసు పెట్టి విని ఆస్వాదించకపోతే.. సన్నివేశాల వేగంలో కొట్టుకుపోయే మెరుపులు చాలానే ఉన్నాయి. ఐతే ఇంద్రగంటి ఎంచుకున్న కథే మరీ పలుచగా అనిపిస్తుంది. చిన్న పాయింట్ పట్టుకుని మరీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో పెద్దగా మలుపులు లేకపోవడం మైనస్. కానీ కామెడీ సన్నివేశాలను.. డైలాగులను ఎంజాయ్ చేయడం మొదలుపెడితే కథ సంగతి పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. రేటింగ్- 2.75/5