* ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర హోంశాఖామాత్యులు, గౌరవ రాష్ట్ర డిజిపిలు
అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 SCT ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖామాత్యులు వంగలపూడి అనిత గారు, రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS ముఖ్య అతిథులుగా పాల్గొని SCT ఎస్సైలకు దిశానిర్దేశం చేశారు.
** రాష్ట్ర హోంశాఖామాత్యుల ప్రసంగం :
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో… డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్త సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తన మెరుగైన పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది. నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణ మొదలుకొని అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో పోలీస్ శాఖ కృషి ఎనలేనిది. అందుకు ముందుగా డిజిపి గారిని మరియు పోలీస్ శాఖను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. అంతటి గొప్ప శాఖకు నేను హోం మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతూ, ఇంతటి అద్భుతమయిన అవకాశాన్ని నన్ను నమ్మి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈరోజు 394 మంది సబ్-ఇన్ స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న నూతన సబ్-ఇన్ స్పెక్టర్లందరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. పోలీస్ శాఖలో కీలకమయిన అధికారాలు, భాద్యతలు కలిగిన సబ్- ఇన్ స్పెక్టర్లుగా మీరు ప్రవేశిస్తున్నారు. పోలీసు ఉద్యోగం మిగతా ఉద్యోగాల వంటిది కాదు. ఇందులో మీరు 24 గంటలు, వారానికి 7 రోజులు విధులలో ఉంటారు. మీకు కావలిసిన గుణాలు నిజాయితీ, నిష్పక్షపాతం, బాధితులపట్ల సానుభూతి, విధిపట్ల నిబద్దత. గౌరవప్రదమైన ఈ ఉద్యోగంలో మీరు సమాజాన్ని సుస్థిరంగా ఉంచి శాంతిభద్రతలు కాపాడే కీలక బాధ్యతలు కలిగి ఉంటారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించి, నేరాలను కట్టుదిట్టంగా అరికట్టడానికి, అలాగే చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడానికి మీరు సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత వుంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, బాధితులకు న్యాయం చేయడం ద్వారానే వారికి భరోసా కలుగుతుంది. అప్పుడే మీరు మీ వృత్తికి న్యాయం చేసినవారవుతారనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ ఉద్యోగం మీరు అహర్నిశలు ఎంతో శ్రమించి, పగలు రేయి కష్టపడి సాధించారు. ఈ డ్యూటీని నిజాయితీగా, సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు ప్రజలకు నిష్పక్షపాతంతో కూడిన సేవలను అందించాలి. నూతనంగా సబ్- ఇన్ స్పెక్టర్లుగా శిక్షణ పూర్తిచేసుకున్న మీలో 97 మహిళా సబ్- ఇన్ స్పెక్టర్లు ఉండటం సంతోషంగా వుంది. మరి ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులకు తెగపడుతున్న సంఘటనలు చూస్తున్నాం. మహిళలు, చిన్నారులపై ఏ చిన్న నేరం జరగకుండా వారిని కాపాడే బాధ్యత మనందరిపైనా ఉంది.
నేడు దేశం ఎంతగానో మారుతుంది. అంతే వేగంగా నేరాలు కూడా సరికొత్త దారుల్లో, ఊహకందని రీతుల్లో ప్రజలను కబళిస్తున్నాయి. అందుకు ధీటుగా మన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందిస్తుంది. నేరాలను అరికట్టడంలో మరియు చట్టాన్ని అమలు చేయడంలో చాలా ప్రగతి సాధించింది మన పోలీస్ శాఖ. దేశంలోనే ఏపీ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంది. నేడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా నేర రహిత సమాజస్థాపన కోసం మన ప్రభుత్వం పని చేస్తుంది. ఇందులో రాజీ ప్రసక్తే లేదు. నేర రహిత సమాజమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాల్సిన గురుతర భాద్యత ప్రధానంగా పోలీసు శాఖ పై వుంది.
పోలీసులుగా మీరు ప్రజలకు మరియు సమాజానికి సేవలందించడానికి అన్ని విషయాల మీద అవగాహన కలిగి వుండాలి. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మెరుగుపడుతుండాలి. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడి సైబర్ నేరాలు అరికట్టేలా కృషిచేయాలి. సైబర్ ల్యాబులను మరింత బలోపేతం చేయడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలి.
రాష్ట్రం లో ఒక ప్రధాన సమస్య గంజాయి. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. గంజాయి, డ్రగ్స్ పై సదస్సులు పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఈ గంజాయి నిర్మూలనకు యాంటి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను (Eagle Stations) ఏర్పాటు చేసి మన రాష్ట్రమును పూర్తిగా గంజాయి మరియు డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయడమే ద్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. విధుల నిర్వహణలో నిజాయితీతో కూడిన ఉన్నత ప్రమాణాలు పాటించి, గ్రామీణుల సమస్యలపై లోతైన అవగాహన పెంచుకోవాలిసిన అవసరం వుంది.
పోలీసు వ్యవస్థలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకొని న్యాయపరమైన సమస్యల వలన ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాము. పోలీసు వ్యవస్థలో అన్ని స్థాయిలలోని సిబ్బందికి సకాలములో పదోన్నతులు ఇవ్వడం ద్వారా వారిలో నూతన ఉత్తేజాన్ని నింపి ఆత్మవిశ్వాసముతో పనిచేసే వాతావరణాన్ని కల్పించి పోలీసు వ్యవస్థ ప్రతిష్టను పెంపొందించుటకు కృషి చేస్తున్నాము.
దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా బ్యాంకు ఖాతాల ద్వారా పోలీసు సిబ్బందికి ఉచిత ప్రమాద భీమా ఒక కోటి రూపాయలు, హోంగార్డులకు రూ. 30 లక్షలు, మానిటరీ ప్రయోజనం కల్పించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల మెరుగైన ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం.
నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అందరూ ఇదే లక్ష్యంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలి. పోలీసుశాఖకు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం అందిస్తాం. ప్రతీ పోలీసు అధికారి, చట్టాల మీద సమగ్ర అవగాహన కలిగి ఉండి శాంతి భద్రతల అమలులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలకు నిరంతర రక్షణ అందించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మరియు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేసింది. మీరు ఈ వర్గాలకు అండగా ఉంటూ వారి హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి చేయాలి. అనునిత్యం ప్రజలతో మమేకమై జవాబుదారీతనంతో మీరు విధులు నిర్వర్తించాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలు సమాజములోని మార్పులకు అనుగుణంగా మార్చబడ్డాయి. ఈ చట్టాలు ప్రజలకు న్యాయాన్ని అందించడములో, ప్రజల భద్రతను పెంపొందించడములో మరియు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఈ కొత్త క్రిమినల్ చట్టాల పట్ల మీరు సంపూర్ణ పరిజ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి.
పోలీసు సంక్షేమములో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేయుచున్న ప్రతి ఉద్యోగికి, శాఖపరంగా వారికి రావాలిసిన ఆర్థిక ప్రయోజనాలను సకాలములో అందేటట్లు మన ప్రభుత్వం కృషి చేస్తుంది.
** రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS ప్రసంగం :
ఈరోజు మీకు మరుపు రానిది. పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ముఖ్యమైన ఘట్టం. శిక్షణ పూర్తీ చేసుకుని సమాజంలోకి అడుగిడుతున్నారు. ఈరోజు ప్రతిజ్ఞ చేసిన విషయాలలో నిష్పక్షపాతంగా, నిర్భయంగా మరియు రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేశారు. ఈరోజు నుండీ పదవీ విరమణ పొందే వరకు ఈ ప్రతిజ్ఞలోని అంశాలను మరువకూడదు. మానవ హక్కులను కాపాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలకు అనుగుణంగా పని చేయడాన్ని ఎప్పుడు మరువకూడదు. చట్టపరంగా పని చేయాలి. పోలీసు సేవలు అవసరమైన వారి పట్ల మరింత సానుభూతితో ఉండాలి. మారుతున్న నేరాలకు అనుగుణంగా మనము అప్ డేట్ అయ్యి వాటిని ఛేదించాలి. ప్రస్తుతం సైబర్ నేరాలు విస్తృతమయ్యాయి. ఈ నేరాలకు కారణాలేవైనా కట్టడి కోసం ప్రతీ జిల్లాలోను సైబర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నాము. సైంటిఫిక్ ఎయిడ్స్ లను వినియోగించి కేసుల దర్యాప్తుల్లో నాణ్యతను పెంచి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం, చివరి వరకు నిజాయితీగా, అంకితభావంతో పారదర్శకంగా విధులు నిర్వర్తించడం ప్రతీ పోలీసుకు ముఖ్యం. శాంతిభద్రతలను కాపాడుకోవడం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి మనం తోడ్పడతామని విశ్వసిస్తున్నాను.
ఈ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుండే శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సెల్ సిస్టం అమలు చేస్తోంది. మంచి స్పందన లభిస్తోంది. 52 శాతం మంది మహిళలు పిటీషనర్లుగా వస్తున్నారంటే పోలీసుశాఖ, ప్రభుత్వంపై విశ్వాసం పెరిగినట్లేనని అవగతమవుతోంది.
డ్రోన్ టెక్నాలజీ – ఆడియో-మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి సాగుతో సహా వివిధ నేరాలపై నిఘా మరియు ట్రాఫిక్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పోలీసింగ్ సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని మెరుగుపరచడానికి లైవ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లు, బాడీ-వోర్న్ కెమెరాలు, డిజిటల్ మొబైల్ రేడియో (DMR) రిపీటర్లు మరియు మ్యాన్‌ప్యాక్‌లను మోహరిస్తున్నారు.
ఈనేపథ్యంలో ప్రజలు, పోలీసు శాఖ, ప్రభుత్వం మీపై చాలా నమ్మకం ఉంచారు. అందరూ వారి అంచనాలకు అనుగుణంగా పనిచేయడానికి కృషి చేయాలి, అంకితభావం మరియు జవాబుదారీతనంతో పనిచేయాలి.
** అనంతరం …శిక్షణ సమయంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్ డోర్ విభాగాలలో రాణించిన, ప్రతిభ కనపరిచిన శిక్షణార్థులకు రాష్ట్ర హోంశాఖామాత్యుల చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు.