పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సిలిండర్ పేలింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి… సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడు ధాటికి ఇంట్లో ఫర్నీచర్, సామాన్లు సుమారు 50 మీటర్ల అవతల ఎగిరిపడ్డాయి. దీనితో ఆ ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని… బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.