వైఎస్సార్ కుటుంబ విభేదాలు ఇప్పుడు గట్టిగా బయటపడుతున్నాయి. వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించడంతో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. వివేకా హత్యకేసు, ఆస్తుల వివాదాలు, వారసత్వం అంటూ షర్మిల తరచూ జగన్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తిని కలిగించాయి.
జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న షర్మిలకు చంద్రబాబు బాసటగా నిలుస్తున్నారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ప్రబలంగా ఉంది. అదే విషయాన్ని రోజా బహిరంగంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారారని, అసలు హంతకులకు మద్దతు ఇవ్వడమే ఆమె ధ్యేయమని రోజా ఆరోపించారు. షర్మిల వ్యాఖ్యలు జగన్‌ను లక్ష్యంగా చేసుకున్న రాజకీయ నాటకం మాత్రమేనంటూ ఘాటుగా మండిపడ్డారు.
అయితే షర్మిల మాత్రం రోజా వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వెంటనే మరోసారి జగన్‌నే టార్గెట్ చేస్తూ, సరస్వతి పవర్ షేర్ల అంశంలో నేరుగా అన్నపై ఆరోపణలు గుప్పించారు. తల్లిపై కేసు, మేనల్లుడి ఆస్తులు, పార్టీ లోపలి వ్యవహారాలపై జగన్ నిజాయితీపైనే ప్రశ్నలు వేసారు. ఇది చూస్తుంటే, ఈ కుటుంబ వివాదం రాజకీయంగా మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది.
వైసీపీ లోపలే ఈ సంఘర్షణ పెరిగితే పార్టీకి ముప్పే అన్న చర్చ మొదలైంది. రోజా వంటి నేతలు నేరుగా షర్మిలపై నిలదీయడం కొత్త దశకు నాంది పలుకుతోంది. ఇప్పుడు షర్మిల ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తే, ఈ చర్చ ఇంకాస్త వేడెక్కనుంది. ఒకదాని మీద ఒకరు విమర్శలు చేస్తూ రాజకీయంగా గట్టి పోరు సాగించబోతున్న ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య అసలైన రాజకీయ సంగ్రామం మొదలైనట్టే.