దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతిదీ ఓ అద్భుతమే. రామ భక్తుడు రామదాసు నిర్మించిన ఆలయంగా భద్రాచలం చరిత్రకెక్కింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే సీతారామస్వామి కళ్యాణ వేడుకను చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు. భద్రాచల ఆలయానికి అనుంబంధంగా కొనసాగుతున్న మిథిలా స్టేడియంలోని ‘మిథిలా మండపం’లో రామయ్య కల్యాణం జరగనుంది. ఉదయం 10.30-12.30 గంటల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
అయితే ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కళ్యాణ వేడుకను మిథిలా కల్యాణమండపంలోనే నిర్వహిస్తారు. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ మండపం.. ఈ శతాబ్దంలోనే నిర్మించబడిన అద్భుత కట్టడాలలో ఒకటిగా నిలిచింది. ఏక శిలపై రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపంపై అద్భుతంగా కళ్లకు కట్టినట్లుగా చెక్కారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి ‘మిథిలా’ మండపాన్ని నిర్మించారు. ప్రత్యేకించి చూస్తే ఈ కళ్యాణమండపం చెక్కిన తీరు నిజంగా ఓ అద్బుతమనే చెప్పాలి.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కొత్తగా కట్టడాలను నిర్మించాలని.. మరికొన్ని పురాతన కట్టడాలను మరమ్మత్తులు చేయాలని ఆరు దశాబ్దాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1958లో ‘భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయ పునరుద్ధరణ సంఘం’ పేరుతో ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు 20 వేల మంది భక్తులు.. ఒకే చోట కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయం సమీపంలోనే ఐదు ఎకరాల స్థలంలో ‘మిథిలా స్టేడియాన్ని’ నిర్మించ తలపెట్టారు. 1960 మే 30 న ఈ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1964 జూన్ 4న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మిథిలా స్టేడియాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణానికి మిథిలా మండపం వేదికగా నిలుస్తుంది. అదే ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది.
పురాణాల ప్రకారం ‘మిథిలా’ అనే పేరు రామాయణంలో సీతాదేవి జన్మస్థలమైన మిథిలా నగరాన్ని సూచిస్తుంది. ఈ మండపం సీతారాముల వివాహానికి సంబంధించిన పురాణ గాథలను ప్రతిబింబిస్తూ.. భక్తులకు ఆ దివ్య సంఘటనను గుర్తు చేస్తుంది.
మిథిలా మండపం సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దీని స్తంభాలు, శిల్పాలు రామాయణ ఘట్టాలను వర్ణిస్తూ ఉంటాయి, ఇది దర్శనీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
భద్రాచలం ఆలయ చరిత్రలో భక్తుడైన భద్రుడు కీలక పాత్ర పోషించాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. మిథిలా మండపం ఈ భక్తి పరంపరను కూడా సూచిస్తుంది.
శ్రీరామనవమితో పాటు ఇతర ప్రధాన ఉత్సవాల సమయంలోనూ ఈ మండపం వివిధ ఆచారాలకు, సేవలకు వేదికగా ఉపయోగపడుతుంది. ఆలయంలో జరిగే సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిథిలా స్టేడియం కేంద్రంగా నిలుస్తుంది.
మిథిలా మండపం దర్శనం భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రత, చారిత్రక నేపథ్యం కారణంగా భద్రాచలం యాత్రలో తప్పక చూడవలసిన ప్రదేశంగా మిథిలా స్డేడియం గుర్తింపు పొందింది.