దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) మరో ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. సొరంగం లోపల టీబీఎం మిషన్ ముందు 50 మీటర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. అక్కడ రెస్క్యూ బృందాల ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో అన్వి రోబోను రంగంలోకి దించారు.
మంగళవారం ఉదయం షిఫ్టులో 110 మంది సహాయక బృందాలతో పాటు అన్వి రోబో బృందంతో లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లారు. అన్వి రోబోను ప్రత్యేక వాహనంలో రోబో బృందం మంగళవారం ఉదయం టన్నెల్ వద్దకు చేరుకున్నది. రోబోతో పాటు దానిని ఆపరేట్ చేసే బృందం లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లారు. మార్నింగ్ షిఫ్టులో లోపలికి వెళ్లిన సహాయక బృందం మధ్యాహ్నం 2-3 గంటలకు బయటకు రానున్నారు.
సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంతో పాటు పక్కన రెండు రోజులపాటు తవ్వకాలు జరిపారు. కేరళ డాగ్స్, జిపిఆర్ సిస్టం ద్వారా గుర్తించిన D1,D2 ప్రదేశాలలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లతో పాటు ఇతర బృందాలు సహాయక చర్యలు చేపట్టినా మిగిలిన ఏడుగురి ఆచూకీ లభించడం లేదు. దీంతో లోపల చివరి పాయింట్ వద్ద రెస్క్యూ బృందాలు వెళ్లడానికి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో అక్కడేమైన మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో తో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా లోపలికి వెళ్లారు. 13.200 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా చేరుకుంటారు. అక్కడనుండి 13.850 కిలోమీటర్ల వరకు కాలినడకన శిథిలాలు, మట్టి, బురద, రెండు ఎస్కవేటర్ల మట్టి, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది.
టన్నెల్‌లో దాదాపు 150 మీటర్ల విస్తీర్ణంలో 16 ఫీట్ల ఎత్తులో మట్టి, బురద, శిథిలాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని తొలగించడానికి చాలా రోజుల సమయం పట్టనుంది. అయితే కేరళ క్యాడర్ డాగ్స్ సూచించిన ప్రదేశాలలో తవ్వకాలను జరుపుతున్నారు.
17 రోజులపాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు కార్మికుల జాడ లభించకపోవడంతో రోబో ద్వారా అయినా ఆచూకీ లభిస్తుందనే ఆశతో రంగంలోకి దింపారు. మానవులు చేరుకోలేని ప్రదేశానికి రోబోను పంపి సహాయక చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. టీబీఎం మిషన్ భాగాలు టన్నెల్ నిండా ఉన్నాయి. దీంతో సహాయక బృందాలు మరింత ముందుకు వెళ్లడానికి టీబీఎం మిషన్ భాగాలను కట్ చేసి కుడి వైపు నుంచి లోపలికి వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు. లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారడంతోపాటు నీటి ఊట కొనసాగుతూ ఉండటంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోశ్‌లు ఎప్పటికప్పుడు రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ చర్యలు చేపడుతున్నారు. 14 బృందాలతో పాటు సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. లోపలికి వెళ్లిన సిబ్బంది తమ వెంట వాటర్ బాటిల్, బిస్కెట్లు, టిఫిన్, సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రితో వెళ్లారు.