సూపర్‌స్టార్ మహేష్ కెరీర్ జర్నీలో కీలక మలుపు గురించి అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ నుంచి వరసగా పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొస్తుంటే, ఇన్నాళ్లు మహేష్ ఈ తరహా రేసులో వెనకబడ్డాడనే అసంతృప్తి ఘట్టమనేని అభిమానుల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు జక్కన్న తనవంతు సహకారం అందిస్తున్నారు.
మహేష్ – రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్.ఎస్.ఎం.బి 29 గత ఏడాది కాలంగా సోషల్ మీడియాల్లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్, ఒడిస్సాలో ఒక షెడ్యూల్ పూర్తయింది. తదుపరి మే- జూన్ లో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేస్తారని సమాచారం. అయితే ఈసారి షెడ్యూల్ లో పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ ని రూపొందించనున్నారు. పైగా ఇది నదిలో తేలియాడే పడవలపై బిగ్ ఫైట్ అని తెలుస్తోంది. నీటిలో తేలియాడే పడవల్లో భారీ పోరాట దృశ్యాల్లో మహేష్- ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితర కీలక నటీనటులు పాల్గొంటారని, వీరితో పాటు దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సీక్వెన్స్ లో నటిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సముద్రంలో బోట్ లో ఫైట్ సీక్వెన్స్ అంటే.. దానికోసం ఉపయోగించే వీఎఫ్ఎక్స్ కూడా అసాధారణంగా ఉంటుంది. ఇప్పటికే పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్న సంగతి తెలిసిందే. నభూతోనభవిష్యతి అనిపించే ఈ పడవ ఫైట్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారని, టెక్నాలజీ సహకారం కోసం రాజమౌళి బృందం వందల కోట్లు వెచ్చించనుందని తెలుస్తోంది. సముద్రంలో బోట్ సీక్వెన్సులు తెరకెక్కించాలంటే దీనికి బ్లూమ్యాట్, గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ లో కూడా క్లోజ్డ్ సర్క్యూట్ లో చిత్రీకరించాల్సి ఉంటుంది. దీని కోసం భారీ సెటప్ కూడా చేయాల్సి ఉంటుందని సమాచారం. ఆంగ్ లీ ఆస్కార్ విన్నింగ్ మూవీ లైఫ్ ఆఫ్ పై కోసం ఉపయోగించిన అసాధారణ టెక్నిక్ ని రాజమౌళి ఉపయోగిస్తారని గుసగుస వినిపిస్తోంది.