గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు భూమ్మీద కాలుపెట్టే సమయం ఆసన్నమైంది. వీరి రెస్క్యూ కోసం నాసా- స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఉదయం 4.30 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్.. ఐఎస్ఎస్‌కు ఆదివారం ఉదయం చేరుకుంది. ఐఎస్ఎస్‌లో విజయవంతంగా డాకింగ్ పూర్తయినట్టు నాసా తెలిపింది. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అమెరికా, జపాన్, రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఐఎస్ఎస్‌కు పంపారు.
అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్‌మోర్‌లను భూమిపైకి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ కొత్త వ్యోమగాములతో ఓ రాకెట్‌ను ప్రయోగించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం 8రోజులపాటు మాత్రమే ఉండటానికి వెళ్లిన సునీత, విల్‌మోర్‌లు భూమికి తిరిగి రావాల్సిన నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకుపైగా అక్కడే ఉండిపోయారు.
కొత్త వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న రెండురోజుల తరువాత సునీత, విల్‌మోర్‌లు భూమిపైకి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు.
”బుచ్, సునీ ఎంతో కష్టపడి పనిచేశారు. వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం” అని ఆయన చెప్పారు.
సునీత, విల్‌మోర్‌లతోపాటు వారి ఐఎస్ఎస్ సహోద్యోగులైన నాసాకు చెందిన నిక్ హేగ్, రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్‌కాస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లను కొత్తగా ఇక్కడి నుంచి వెళుతున్న నలుగురు వ్యోమగాములు (రష్యా, జపాన్‌ల నుంచి ఒకొక్కరు, అమెరికా నుంచి ఇద్దరు) రిలీవ్ చేస్తారు.
ఈ కొత్త వ్యోమగాములకు అక్కడి బాధ్యతల అప్పగింత కార్యక్రమం పూర్తవడానికి 2రోజుల సమయం పడుతుంది. తరువాత వారు భూమికి పయనమవుతారు. కానీ రిటర్నింగ్ క్యాప్సుల్ సురక్షితంగా వచ్చేందుకు భూమిపై పరిస్థితులు అనుకూలంగా ఉండేవరకు వారు వేచి ఉండాల్సి రావచ్చని, దీనివల్ల వారి రాక ఆలస్యం కావచ్చని ఐఎస్ఎస్ ప్రోగ్రామ్ మేనేజర్ డానా వీగెల్ చెప్పారు.
”వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి. ఒకవేళ అనుకూలించకపోతే మరింత సమయం తీసుకుంటాం” అని ఆమె విలేఖరులకు చెప్పారు.
కిందటి వారం నుంచే అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు, అక్కడి బాధ్యతల అప్పగింత కార్యక్రమానికి సిద్ధమయ్యారని వీగెల్ వివరించారు.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 2024 జూన్‌లో బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్న వీరు వారం రోజుల్లోనే భూమికి తిరిగి రావాల్సి ఉండగా, వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల ఇది ఆలస్యం అయింది. చాలా సార్లు రాకెట్ ప్రయోగాలను ప్రణాళికలో పెట్టినా, సమస్యలు ఎదురుకావడంతో వారి భూమికి రాక వాయిదా పడుతూ వచ్చింది. ఇక, చివరకు ఇప్పుడు ఫాల్కన్ 9 రాకెట్ వీరిని తీసుకురావడానికి నింగికెగసింది.
నాసా-స్పేస్ఎక్స్ భాగస్వామ్యంతో చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం ప్రారంభించింది. ముందుగా ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 12న చేపట్టాలని భావించినా, గ్రౌండ్ సిస్టంలో సమస్యలు తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. చివరకు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ లతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ ఇప్పుడు ఐఎస్ఎస్‌కు చేరుకుంది.
ఇప్పుడు ఈ కొత్త వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ భూమికి తిరిగి రావడానికి సన్నాహాలు జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, వారు 19న భూమికి ప్రయాణమయ్యే అవకాశం ఉంది. గత 9 నెలలుగా సాంకేతిక సమస్యల కారణంగా తమ రాక వెనుకబడిన నేపథ్యంలో, ఈసారి మిషన్ విజయవంతమవుతుంధని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సునీతా విలియమ్స్ తన అంతరిక్ష ప్రయాణాల్లో ఎన్నో విజయాలను సాధించినా, ఈసారి ఆమెకు ఎదురైన అనుభవం భిన్నంగా ఉంది. ప్రణాళిక ప్రకారం కేవలం వారం రోజుల మిషన్‌గా మొదలైన ఈ ప్రయాణం, 9 నెలలు సాగిపోయింది. ఇది అంతరిక్ష ప్రయోగాల మీద కొత్త చర్చలకు దారితీస్తోంది. సాంకేతిక లోపాలతో వ్యోమనౌకలు ఎలా నిర్ధారణ చేయబడుతున్నాయో, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎలా నివారించవచ్చో అనే అంశాలపై నాసా, బోయింగ్ మరింత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది. అనుకున్న కంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో గడిపిన వీరు, మార్చి 19న స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమి వైపు ప్రయాణం చేయనున్నారు. దాదాపు 8 నెలలుగా జీరో గ్రావిటీ పరిసరాల్లో ఉన్న వీరికి భూమికి చేరిన తర్వాత అనేక మార్పులు ఎదురయ్యే అవకాశముంది.
అంత కాలం శూన్యాకర్షణలో గడిపిన తర్వాత భూమి మీద సాధారణ పనులు కూడా గంభీరంగా అనిపిస్తాయని విల్మోర్ వెల్లడించారు. చిన్న వస్తువును లేపినా, భారీ బరువును ఎత్తినట్లుగా అనిపించవచ్చని చెప్పారు. శరీరం తిరిగి భూమి ఆకర్షణశక్తికి అలవాటు పడే వరకు కొన్ని రోజులు అసౌకర్యం తప్పదని తెలిపారు. స్పేస్ నుంచి తిరిగి వచ్చిన 24 గంటల్లోనే వ్యోమగాములు మానసికంగా, శారీరకంగా మార్పులను అనుభవిస్తారని నాసా తెలిపింది.
అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములకు ఆరోగ్యపరమైన ప్రభావాలు తప్పవు. శరీరం మైక్రో గ్రావిటీ పరిస్థితులకు తగ్గట్టుగా మారడం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ సరఫరా తగ్గి, నిస్సత్తువ, అలసట, పని సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు, ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది.
వైరుధ్యంగా ఉన్న పరిస్థితులకు శరీరం పూర్తిగా సరిపోయే వరకు వ్యోమగాములు పర్యవేక్షణలో ఉంటారు. గుండె పనితీరు కూడా మారే అవకాశం ఉండటంతో, వీరు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాముల భవిష్యత్తు ప్రయాణాల కోసం, వీరి అనుభవాలు నాసా కొత్త పరిశోధనలకు దోహదపడతాయని చెబుతున్నారు.