అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడం, క్రిస్మస్ వేడుకను ఎంజాయ్ చేయడం, జీరో గ్రావిటీలో కూడా ఫిట్‌గా ఉండటం… ఇవన్నీ సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో బిజీగా ఉంచిన పనుల్లో కొన్ని.
తొమ్మిది నెలల తర్వాత, వీరిద్దరూ భూమికి చేరుకున్నారు.
అయితే, భూమికి 400 కి.మీల ఎత్తులో పరిభ్రమించే నాసా వ్యోమగాముల జీవితం ఎలా ఉంటుంది? ఆ సమయంలో వారెలా గడుపుతారు?
వారిని ఎల్లప్పుడూ బిజీగా ఉంచేందుకు స్పేస్‌లో చాలా పనులు ఉంటాయి.
59 ఏళ్ల సునీతా విలియమ్స్, 62 ఏళ్లు బుచ్ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగే ఎన్నో మిషన్లకు సాయపడ్డారు. మెయింటెనెన్స్‌తో పాటు పలు ప్రయోగాలు చేపట్టారు.స్పేస్‌వాక్‌లు కూడా నిర్వహించారు.
సునీతా విలియమ్స్ జనవరి మధ్యలో క్రాఫ్ట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు తన తోటి వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి బయటికి వచ్చారు. ఆ నెల చివరిలో సునీతా, బుచ్‌లు కలిసి అంతరిక్ష కేంద్రం బయట తిరిగారు.
స్టేషన్ ఓరియెంటేషన్‌ను నిర్వహించే పరికరాలకు మరమ్మతులు చేయడం, అంతరిక్ష కేంద్రంలో ఉండే ఎన్ఐసీఈఆర్ ఎక్స్-రే టెలిస్కోప్‌కు లైట్ ఫిల్టర్లను అమర్చడం, ఇంటర్నేషనల్ డాకింగ్ అడాప్టర్‌పై రిఫ్లెటర్ డివైజ్‌ను మార్చడం వంటి పనులు చేశారు.
అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఇలా ప్రయాణించే సమయంలో, 16 సూర్యోదయాలను, 16 సూర్యాస్తమయాలను చూస్తారు.
ఆ కేంద్రంలో ఉన్న వారు ప్రతి 45 నిమిషాలకు ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తుంటారు.
భూమిని ఒక ప్రత్యేక కోణంలో చూస్తూ జీవించడం ద్వారా.. దాని గురించి మరింత తెలుసుకునేందుకు అవసరమైనంత సమయం దొరుకుతుందని సునీతా విలియమ్స్ చెప్పారు.
కాస్త భిన్నంగా ఆలోచించేందుకు మీకు అవకాశం దొరుకుతుంది. మనకున్న ఒకే ఒక్క గ్రహం ఇది. దీన్ని బాగా చూసుకోవాల్సి ఉంది.” అని అన్నారు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పుడు, ఎంతో మంది ఆమెకు భూమి నుంచి సందేశాలు పంపారు. ఈ సందేశాలు తనకు ప్రతి ఒక్కరితో ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తున్నాయని అన్నారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతో పాటు.. వారితో ఉన్న మరో ఇద్దరు అమెరికన్లు డాన్ పెటిట్, నిక్ హేగ్‌లు గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని పొందారు.
పౌరులుగా ఇది అత్యంత ముఖ్యమైన విధి అని సునీతా విలియమ్స్ రిపోర్టర్లతో అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తాము పాలుపంచుకునేలా నాసా చక్కగా అవకాశం కల్పించిందని బుచ్ విల్‌మోర్ చెప్పారు.
ఓటు వేసే అవకాశం కల్పించేందుకు హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ ఎన్‌క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా బ్యాలెట్ పేపర్లను అంతరిక్ష కేంద్రానికి పంపింది.
వ్యోమగాములు వాటిని నింపి శాటిలైట్ ద్వారా పంపించారు. అక్కడి నుంచి అవి న్యూ మెక్సికోలోని గ్రౌండ్ టెర్మినల్‌కు వచ్చాయి.
ఆ బ్యాలెట్ న్యూ మెక్సికో నుంచి జాన్సన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు, అక్కడ నుంచి కౌంటీ క్లర్క్‌కు చేరింది.
ఓటుకున్న సమగ్రతను కాపాడేందుకు ఆ డేటాను రహస్యంగా ఉంచారు. అందులో ఉన్న వివరాలు కౌంటీ క్లర్క్‌కు, అప్లికేషన్ పంపించిన ఆస్ట్రోనాట్‌కు మాత్రమే తెలుస్తాయి.
బుచ్ తన రోజువారి కార్యక్రమాలను 4.30కు మొదలుపెడితే, సునీతా విలియమ్స్ 6.30కు తన రోజును ప్రారంభించేవారు.
స్పేస్ స్టేషన్‌లో దీర్ఘకాలంపాటు ఉండాల్సి వచ్చినప్పుడు, ఎముకలు బలహీనపడే పరిస్థితిని తట్టుకునేందుకు ప్రతిరోజు రెండుగంటలు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
తాము రోజూ రెండు గంటలు లేదా అంతకు మించిన ఎక్సర్‌సైజులు చేసినట్లు ఈ ఇద్దరు చెప్పారు.
కండరాలకు ఉపయోగపడే అన్నిరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్‌సైజ్ డివైస్ (ఏఆర్ఈడీ) ఉపయోగపడుతుంది.
స్పేస్ స్టేషన్‌లోని సిబ్బంది ట్రెడ్‌మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్‌ను కూడా వాడతారు.
అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు.. భూమి మీదున్న తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు పంపారు.
వారు శాంటా మాదిరి డ్రస్‌లు వేసుకున్నారు. నెమ్మదిగా కదిలే మైక్రోఫోన్‌ను ఒకరి నుంచి ఒకరు తీసుకుంటూ మాట్లాడే సమయంలో.. క్యాండీ కేన్స్ వారి తలల చుట్టూ ఎగురుతూ కనిపించాయి. ఈ సమయంలో సునీతా జుట్టు ఎగురుతూ కనిపించింది.
మార్చి 16న స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ కొత్త బృందంతో అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నప్పుడు, బుచ్, సునీతలకు అది ఎంతో ముఖ్యమైన సందర్భం.
ఎందుకంటే, వాళ్లు ఇంటికి తిరిగి వెళ్లే వాహనం అదే. 286 రోజుల సుదీర్ఘ అంతరిక్ష వాసాన్ని గడిపిన సునీతా, బుచ్‌లు..బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీర ప్రాంతంలోని జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.