సిరియాలో అంతర్యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 48 గంటల్లోనే 745 మంది ప్రతీకార హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అలావైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం అసద్ మద్దతుదారులపై ప్రభుత్వ అనుకూల సాయుధ గ్రూపులు దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల అనంతరం అసద్ మద్దతుదారులను వెతికి మరీ చంపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బనియాస్ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
రోహిబ్ కమెల్ అనే వ్యక్తి తన కుటుంబంతో బాత్రూమ్‌లో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నాడు.
“వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. మగవారిని ఇళ్ల పైకప్పులపైకి తీసుకెళ్లి కాల్చేస్తున్నారు” అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీర్ హైదర్ అనే బాధితుడు తన ఇంటిలోకి సాయుధులు చొచ్చుకొచ్చి తన ఇద్దరు సోదరులు, అల్లుడిని హత్య చేసినట్లు వెల్లడించాడు.
రేవు నగరమైన లటాకియాలో హింస తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం అధిపతి యాసిర్ సబౌహ్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. అలావైట్ల జనాభా అధికంగా ఉన్న లటాకియాలో అల్లర్లు ముదిరాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం
మార్చి 6 నుంచి ఇప్పటి వరకు 973 మంది మరణించారు. గత 48 గంటల్లో 745 మంది హత్యకు గురయ్యారు.
సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అలార్రా వీడియో సందేశం విడుదల చేశారు. తాజా హింసపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. విదేశీ శక్తుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అలావైట్లు సిరియాలో మైనారిటీ మత సముదాయంగా ఉన్నారు. దేశ జనాభాలో 12% మంది అలావైట్లే. వారు ప్రధానంగా షియా ముస్లింల మూలాల నుండి వచ్చారని భావించబడతారు. అసద్ కుటుంబం గత 50 ఏళ్లుగా సిరియాపై పాలన సాగించింది. అలావైట్లు సైన్యంలో, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కొనసాగారు.
అంతర్యుద్ధంతో సిరియా అట్టడుకుతోంది. మాజీ అధ్యక్షుడు బషర్ అస్సాద్ అనుకూల వర్గాలు, సెక్యూరిటీ బలగాల మధ్య ఘర్షణతో సిరియా అట్టడుకుతోంది. రెండ్రోజులుగా జరిగిన ఘర్షణలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వీరిలో 745 మంది పౌరులు.. 125 మంది ప్రభుత్వ భద్రతా దళ సభ్యులు, 148 మంది అసద్ మద్దతు దారులు ఉన్నారు. పద్నాలుగేళ్ల క్రితం సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభం కాగా.. అప్పట్నుంచి ఇదే అత్యంత దారుణ ఘటన. వీధుల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాటిని తీసేందుకు భయంతో ఎవ్వరూ కూడా బయటకు రావడం లేదు. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాలలో విద్యుత్, తాగునీరు నిలిపివేశారు.
అసద్ పారిపోయినప్పట్నుంచి గొడవ
మాజీ అధ్యక్షుడు అసద్ అధికారం నుంచి వైదొలిగిన తర్వాత దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయారు. కాగా.. తిరుగుబాటు దారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం అసద్ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హతమార్చాయి. అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి నివాసాలకు నిప్పంటించాయి. దీంతో, ఘర్షణలు ముదిరిపోయాయి. ఇక, దాడుల్లో మృతి చెందిన ఐదుగురు సిరియన్ దళాలకు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనికి అనేక మంది ప్రజలు హాజరయ్యారు. మరోవైపు, సిరియా హింసపై ఫ్రాన్స్ తీవ్ర ఆందోళవ వ్యక్తం చేసింది. మతప్రాతిపదికన పౌరులపై, ఖైదీలపై జరిగిన దారుణాలను ఖండిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ పేర్కొంది.