టాలీవుడ్ అందాల భామ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మల ప్రేమకథ మరో మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. ఇద్దరూ రెండేళ్ల క్రితం ‘లస్ట్ స్టోరీస్ 2’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పబ్లిక్ ఈవెంట్స్, పర్సనల్ గ్యాథరింగ్స్ లో జంటగా తరచూ కనిపించిన వీరిద్దరూ… ఇటీవల మళ్లీ మీడియా కంటికి దూరంగా ఉన్నారు. దీంతో విడిపోయారన్న వార్తలు ఊపందుకున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటి రవీనా టండన్ హోలీ పార్టీకి తమన్నా, విజయ్ వేరువేరుగా హాజరై మళ్లీ ఊహాగానాలకు బలం చేకూర్చారు. ఈ వేడుకలో ఇద్దరూ ఒకే చోట ఉన్నా కలిసి ఫొటోలు దిగలేదు, మాట్లాడినట్లు కూడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో చీకటి తెర వెనుక నడుస్తోందన్న సందేహాలు మళ్లీ ముదిరాయి.
అయితే ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌లో విజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రేమను ఐస్‌క్రీమ్‌తో పోల్చిన విజయ్, “దాని ఫ్లేవర్ ఏదైనా సరే, పూర్తిగా ఆస్వాదించాలి” అని అన్నారు. బాధ, కోపం, ఆనందం అన్నింటినీ స్వీకరించాల్సిందేనని చెప్పిన ఆయన వ్యాఖ్యలే నిజానికి బ్రేకప్‌కు బలమైన క్లూగా మారాయి. ప్రేమలో ఉన్న వారిలా కాక, రిలేషన్ గురించి తటస్థంగా మాట్లాడారు.
ఇటీవల తమన్నా చేసిన కామెంట్స్ కూడా ఇదే విషయాన్ని మద్దతిస్తుండడం గమనార్హం. “ప్రేమను లావాదేవీలా చూసినప్పుడే దానిలో బంధం కాస్త నష్టమవుతుంది. నేను రిలేషన్ లో లేనప్పుడే హ్యాపీగా ఉంటాను” అని చెప్పడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. రెండు వైపుల నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, ఈ జంట బంధానికి ఎండ్ కార్డు పడినట్టే కనిపిస్తోంది. కానీ ఇంతవరకు ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించకపోవడం వల్ల అభిమానుల్లో ఇంకా కొంత అనుమానం మిగిలేలా ఉంది