రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో ఎవరు.. ఎప్పుడు.. ఎవరి వైపు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి. అధికారంలో ఉంటే బలంగా ఉన్నామని గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే కేడర్, దిగువస్థాయి నేతలు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోవడం ఖాయం.
దశాబ్దాల తరబడి వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల కంచుకోట. ఇప్పుడు ఆ కోట బద్దలవుతోంది. రేపో మాపో ఆ కోటపై టీడీపీ జెండా రెపరెపలాడబోతోంది. తెర వెనుక జరగాల్సిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. పులివెందుల టార్గెట్‌గా కడప టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
మాజీ సీఎం జగన్ ఈసారి అసెంబ్లీకి రాకుంటే ఆయన సభ్యత్వం రద్దు కావడం ఖాయం. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రెండురోజుల కిందట మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. అధినేత పరిస్థితి ఇలావుంటే.. తమ పరిస్థితి ఏంటన్నది అప్పుడే ఆ పార్టీలో చర్చ మొదలైంది.
పులివెందుల మున్సిపాలిటీని వైసీపీ కోల్పోతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ సొంత నియెజకవర్గం పులివెందులలో వైసీపీ నుండి టీడీపీలో క్యూ కట్టారు ఆ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు. మంగళవారం టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో వైసీపీ 30 డివిజన్ కౌన్సిలర్ సాహిదాతో పాటు 30 కుటుంబాలు టీడీపీ లో చేరాయి. బుధవారం బ్రాహ్మణ పల్లెకు చెందిన మరో 30 కుటుంబాలు చేరాయి. సొంత నియోజకవర్గంలో కేడర్ వెళ్లి పోవడంతో ఆలోచనలో పడ్డారు ఆ పార్టీ నేతలు.
మాజీ సీఎం సొంత నియోజకవర్గంలో దిగువ స్థాయి నాయకులు, కేడర్ వెళ్లిపోవడంతో అయోమయంలో పడింది జిల్లా వైసీపీ. ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలా అనేదానిపై ఆలోచనలో పడింది. పనులు కావాలంటే మరో మార్గం లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్గాలను అన్వేషిస్తోంది.
మొన్నటికి మొన్న పులివెందుల మున్సిపాలిటీ వైసీపీ చేజారు తుందని భావించారు వైసీపీ నేతలు. ఈలోగా జగన్ ఎకాఏకీన పులివెందుల వెళ్లడం, కౌన్సెలర్లతో మాట్లాడడంతో కాసింత తగ్గనట్టు కనిపించారు. అయినా సరే వెళ్లిపోవాలనే కౌన్సెలర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పులివెందుల ఉప ఎన్నికలు వస్తే మరిన్ని కష్టాలు తప్పవని ఆ పార్టీ నేతలు అనుకోవడం గమనార్హం.
పులివెందుల టార్గెట్‌గా కడప టీడీపీ నేతలు అడుగులు..!