తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు రంగం సిద్దం అవుతోంది. కొత్తగా అయిదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సామాజిక – ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పుల దిశగా తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త మంత్రులను దాదాపు ఖరారు చేసారు. ఇదే సమయంలో తాజాగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రి పదవి విషయంలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
తెలంగాణ మంత్రివర్గంలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమేనా. ఢిల్లీలో విజయశాంతికి మంత్రి పదవి విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ – బీజేపీని టార్గెట్ చేసేందుకు విజయశాంతి సరైన అస్త్రంగా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ లో చేరే సమయంలోనే నాడు పార్టీ ముఖ్య నేతలు రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం – పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో విజయశాంతికి అనూహ్యంగా ఢిల్లీ స్థాయిలో నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక.. విజయశాంతికి మంత్రిగానూ అవకాశం ఇవ్వబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు మంత్రి పదవి పైన కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఆసక్తి కర చర్చ మొదలైంది.
మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం కేబినెట్ లో ఒక మహిళా మంత్రి తన వ్యాఖ్యలతో వివాదాస్పదం అయ్యారు. కొంత కాలంగా మౌనంగానే ఉంటున్నారు. ఆ మంత్రి స్థానంలో విజయశాంతికి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పని చేసిన వారికి.. ఇతర పార్టీల నేతలను చేర్చుకునే సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఈ సారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు సమయం లో అవకాశం ఇవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే సమయం లో ప్రస్తుత మంత్రులు బాధ్యతలు చేపట్టి 17 నెలలే అవుతుండటంతో వారిని తెలిగిస్తే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయనే చర్చ మొదలైంది.