తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. వరంగల్‌లో బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఉన్న గర్జన కాకుండా, ఈసారి కేసీఆర్ మాటల్లో తడబడిన తీరు స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు, కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసినా, ఆ స్పీచ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై సూటిగా విమర్శలు గుప్పించారు. మంత్రి సీతక్క, కేసీఆర్‌ను నియంతగా అభివర్ణిస్తూ, ప్రజల తీర్పును ఇప్పటికీ మింగలేకపోతున్నారని అన్నారు. అదేవిధంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్‌ను అసెంబ్లీ సమావేశాలపై సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను అటుంచి వ్యవస్థలను దుర్వినియోగం చేసిన వారే ఇప్పుడు నైతికతపై ఉపదేశాలు ఇవ్వడం విచిత్రమని మండిపడ్డారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ సభపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గుర్తించకుండా, ఇతరులను నిందించడం అన్యాయం అని పేర్కొన్నారు. ప్రజలు సభకు రాకపోయినా పోలీసులపై నెపం నెట్టడం సమంజసం కాదని అన్నారు. ఉద్యమకారుల త్యాగాలను మరిచిపోయారన్న ఆరోపణలు కూడా చేశారు.
ఆర్థిక వ్యవస్థను చెడగొట్టినట్లు బీఆర్ఎస్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందని, ఇది చరిత్రలో పెద్ద రికార్డ్‌గా నిలిచిందని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రుల పాలనతో పోలిస్తే ఈ అప్పు మూడింతలు ఎక్కువగా పెరిగిందని గుర్తు చేశారు. మొత్తం మీద కేసీఆర్ వరంగల్ సభ తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్టే. మంత్రులు సూటిగా విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్‌కు ఎదురు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.