బిహార్‌లో సినీఫక్కీలో బంగారు నగల చోరీ జరిగింది. ఎనిమిది మంది సాయుధులు భోజ్‌పుర్ జిల్లా ఆరా పట్టణంలోని తనిష్క్ బంగారు నగల షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిపై తుపాకీ గురిపెట్టి రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు షోరూమ్‌ను తెరవగా ఎనిమిది మంది దుండగులు తుపాకులతో లోనికి ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొని షోరూంను మూసివేశారు. అనంతరం తమ వద్దనున్న ఆయుధాలతో షోరూం సిబ్బందిని దుండగులు బెదిరించారు. షోరూం సిబ్బంది మెుత్తాన్ని ఒక చోట ఉంచి అల్మరాలు, పెట్టెల్లో ఉన్న నగలను మెుత్తం దోచుకున్నారు. ఈ సమయంలో షోరూం సిబ్బంది ఒకరు రాగా దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ షోరూంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
దుండగులు నగలతో ఉడాయించగానే షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఖాకీలు వారిని వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు రూ.25 కోట్ల విలువైన బంగారం ఆభరణాలు చోరికి గురయ్యాయని షోరూం మేనేజర్ తెలిపారు. దుండగులు ఎత్తుకెళ్లిన వాటిలో గోల్డ్ చైన్లు, నెక్‌లెస్‌లు, వజ్రాభరణలు ఉన్నాయని చెప్పారు. నిందితులు తుపాకులతో కొట్టడం వల్ల తమ సిబ్బంది ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. దొంగతనానికి 8 నుంచి 9 మంది వచ్చారని చెప్పిన ఆయన వారిలో కొంత మంది తమ సిబ్బంది వద్ద ఉండగా మరికొందరు నగలను లూటీ చేశారని చెప్పారు. దోపిడీ జరిగిన సమయంలో షోరూంలో 25 మంది సిబ్బంది ఉన్నారని మేనేజర్ తెలిపారు.దోపిడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.