ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే . అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం అంటూ మాట్లాడారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్‌తో కలిసి ఇవాళ ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమం కోసం మొత్తం 600 మంది మార్గదర్శకులు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పదివేల బంగారు కుటుంబాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాలు బాగుపడాలని ఆకాంక్షించారు.
వచ్చే నాలుగు సంవత్సరాలలో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాము అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ పీ 4ద్వారా లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇలా పవన్ గురించి పవన్ తనకు మద్దతు తెలపడం గురించి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికలలో భాగంగా చంద్రబాబు నాయుడు జనసేనతో పాటు బిజెపితో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీలు 164 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.