తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసులో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఈ సిట్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది. ఈ కేసులో ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్ (45), పోమిల్ జైన్ (47), తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ (69) అరెస్టయ్యారు.
కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, పోమిల్ జైన్ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నలుగురినీ ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8.20 గంటల సమయంలో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురినీ భారీ భద్రత నడుమ రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9.10 గంటలకు 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు.
కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి, నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్ జైలుకు తరలించారు.
వైఎస్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. 2024 జూన్ 16న తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా… నెయ్యి నాణ్యత బాగాలేదని వాళ్లు చెప్పారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
మరోవైపు, జూన్, జులైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది. తిరుమలలో ప్రసాదాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి వాడతారు. అయితే గతంలో వనస్పతి మాత్రమే కలిసి కల్తీ అయిందని చెప్పిన ఈవో శ్యామల రావు, నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిసిందని ప్రకటించారు.