గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ తీసుకున్నప్పటికీ, ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడాలనే ఉద్దేశంతో ఆయన వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారుడిని ఒప్పించి కేసును ఉపసంహరించుకునేలా ప్రలోభాలు అందించిన వంశీ అనుచరుల ప్లాన్ చివరకు బూమరాంగ్ అయ్యిందని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్‌ను వంశీ అనుచరులు ట్రాప్ చేశారట. కేసును వెనక్కి తీసుకునేలా ఒప్పించేందుకు మొదట బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. మాట వినకుంటే ప్రాణాల మీదకి తెస్తామనే హెచ్చరికలు ఇచ్చిన వారే, మరోవైపు రూ.40 లక్షలు ఇస్తామని ఎర వేయడం గమనార్హం. చివరకు సత్యవర్ధన్ ఒప్పుకోవడంతో, మొదట రూ.20 వేల అడ్వాన్స్ ఇచ్చి మిగతా మొత్తం కేసు పూర్తిగా విరమించిన తర్వాత అందిస్తామని చెప్పారట.
ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సత్యవర్ధన్ తన ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని చెప్పాడు. న్యాయమూర్తి స్టేట్‌మెంట్ ఇవ్వగలరా అని ప్రశ్నించగా, సత్యవర్ధన్ అవునని సమాధానం ఇచ్చాడు. అంతా అనుకున్నట్లుగానే సాగినా, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. కేసు విత్‌డ్రా అయిన తర్వాత వంశీ అండ్ కో పూర్తి మొత్తాన్ని ఇవ్వకపోవడంతో విషయం బయటపడిపోయింది.
రూ.40 లక్షలు అందుతాయని నమ్మిన సత్యవర్ధన్‌కు చివరకు కేవలం రూ.20 మాత్రమే అందాయట. మిగిలిన మొత్తం ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో అసలు వ్యవహారం బహిరంగమైంది. ఈ నేపథ్యంలో వంశీ అండ్ కో కుట్ర బయటపడింది. చివరకు, చక్కని ప్లాన్ వేసిన వంశీ తనకే ఎసరు పెట్టుకున్నట్లు అయింది. ఈ వ్యవహారం మరింత దర్యాప్తుకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.