పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనేననంటూ బాంబ్ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనేనన్నారు. తాజాగా కాకినాడలో కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని కొనియాడారు.
వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది,ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు. వర్మ కి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుందని చురకలు అంటించారు. పవన్ సెక్యూరిటీ విషయం లో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటామని ప్రకటించారు. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తామన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేసామని తెలిపారు.
ఎమ్మెల్సీ రాకపోవడంపై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి తో 23 ఏళ్ళు అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలు మేరకు పని చేస్తానని ప్రకటించారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. కూటమి విజయానికి నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేశానని తెలిపారు.
ఇదే అంశంపై కేఏ పాల్ చాలా సీరియస్ అయ్యారు. పిఠాపురం వర్మా కు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై కేఏ పాల్ స్పందించారు. పిఠాపురం వర్మా.. నీకు బుద్ధుందా.. చంద్రబాబు మాట నిలబెట్టుకోడని అప్పుడే చెప్పాను కదా అంటూ మండిపడ్డారు. నేను చెప్పినట్లే పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడన్నారు. పిఠాపురం వర్మకు తదుపరి జరిగే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అవకాశం ఇస్తా అన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీడీపీ ఆదివారం(మార్చి 9) ప్రకటించింది. సీనియర్లను పక్కన పెట్టి మరోసారి యువ నేతలకే స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఏపీలో మొత్తం స్థానాలకు ఖాళీలు ఏర్పడగా, పొత్తులో భాగంగా జనసేనకు ఒక సీటు కేటాయించారు. మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని భావించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీకి ఒక సీటు కేటాయించారు.
టీడీపీ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడులను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఛాన్స్ దక్కగా, బీజేపీ నుంచి సోము వీర్రాజు పోటీ చేయనున్నారు.
టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎమ్మెల్సీ టికెట్లు ఆశించారు. వీరిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఉన్నారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు దక్కింది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి గెలిచారు. పవన్ కల్యాణ్ గెలుపునకు పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పనిచేశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం వర్మకు హామీ ఇచ్చిందని తెలుస్తోంది. తాజాగా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ…వర్మకు ఛాన్స్ ఇవ్వలేదు.
సామాజిక వర్గాల వారీగా ముగ్గురికి అవకాశం కల్పిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. పిఠాపురం వర్మకు అవకాశం కల్పించకపోవడంతో సోషల్ మీడియాలో ఓ వర్గం ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తుంది. వర్మ అసహనంతో ఉన్నారని, జనసేన నమ్మించి మోసం చేసిందని ట్వీట్లు చేస్తుంది. అయితే వైసీపీ మద్దతుదారులు కూటమిలో చిచ్చు పెట్టేందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ రాకుండా జనసేన పార్టీ అడ్డుకుంటోందని, కూటమి ఐక్యతను దెబ్బతీయాలని కొంత మంది పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జనసేనకు మద్దతుగా పోస్టులు పెట్టే జనసేన శతగ్ని ట్వీట్ చేసింది. ఎస్వీఎస్ఎన్ వర్మకు ఉన్నత స్థానం కల్పించమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏనాడో చెప్పారని ప్రకటించింది. అయితే తమ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, సీఎం చంద్రబాబు తీసుకుంటారని, వారి పార్టీలో స్థితిగతుల ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో ఈ నిర్ణయాలు తీసుకుంటారని తెలిపింది.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాల విషయంలో జనసేన పార్టీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది? అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యహారాల్లో టీడీపీ కూడా కలుగజేసుకోదని పేర్కొంది. ఇరు పార్టీల మధ్య పొత్తు స్నేహపూర్వక వాతావరణంలో, ఎవరి విలువ వారు కాపాడుకుంటూ హుందాగా ముందుకు వెళ్తుందని వెల్లడించింది. దీన్ని దెబ్బతీసేందుకు కొందరు చేసే ప్రయత్నలు వృథా ప్రయాసేనని తెలిపింది.
“ఎస్వీఎస్ఎన్ వర్మకు సముచిత స్థానం కల్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాక్షించారు. కానీ వర్మ టీడీపీ నాయకులు, వారి పార్టీలో పదవులు ఇవ్వడం అనేది పూర్తిగా వారి అంతర్గత విషయం. జనసేన అంతర్గత విషయాల్లో టీడీపీ., టీడీపీ అంతర్గత విషయాల్లో జనసేన కలగజేసుకోలేవు కనుక ఈ విషయంలో జనసేన పార్టీని నిందించడం సమాజసం కాదు అని తెలియజేసుకుంటున్నాను”- కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామ స్వామి.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అన్న ఆయన…వర్మ చాలా సీనియర్ నేత అని, ఆయన విషయంలో టీడీపీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అది టీడీపీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వర్మని గౌరవించడంలో జనసేనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.
పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు, నేతలతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ భేటీ అయ్యారు. కార్యకర్తలతో భావోద్వేగంతో మాట్లాడారు. “పార్టీ ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలి. టీడీపీ అంతా ఒక కుటుంబం. చంద్రబాబుతో నాకు 23 ఏళ్ల అనుబంధం ఉంది. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలు, నిర్ణయాలకు నేను, నా కుటుంబం, పిఠాపురం టీడీపీ నేతలు ఎప్పుడూ శిరసావహిస్తాం. పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటాం” అని వర్మ అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టికెట్ ఆశావహులతో ఫోన్ లో మాట్లాడారని సమాచారం. సీటు ఎందుకు కేటాయించలేకపోయారో, సీఎం చంద్రబాబు మాటగా వారిని బుజ్జగించారని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ టికెట్లు రాకపోయేసరికి నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవినేనిఉమా, బుద్ద వెంకన్న, జవహర్, పీతల సుజాత, మోపిదేవి వెంకటరమణ ఇలా చాలా మంది ఎమ్మెల్సీ ఆశించారు. కానీ సామాజిక అంశాల మేరకు వీరిటి ఎమ్మెల్సీ టికెట్లు దక్కలేదని తెలుస్తోంది.