టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వీరయ్య హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని చెప్పారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 12 బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు కరుడుగట్టిన నేరస్తులతో వీరయ్యను హత్య చేయించారని, 53 కత్తిపోట్లు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటివి చూసినప్పుడు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరయ్య చౌదరి మంచి నాయకుడు, సమర్థమైన వ్యక్తి అని సీఎం కీర్తించారు. యువగళం సమయంలో 100 రోజులు లోకేష్‌తో తిరిగారని గుర్తు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలోనూ రైతులకు అండగా నిలబడ్డాడన్నారు. ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వీరయ్య చౌదరి పని చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాల నుండి క్లూస్ కూడా తీసుకుంటున్నామని.. ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఎం సూచించారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారన్నారు.
నేరగాళ్లను పట్టుకుని తీరుతామని.. కఠిన శిక్ష విధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ కుటుంబ సభ్యుల్లాగా వీరయ్య కుటుంబాన్ని చూసుకుంటామన్నారు. నేర రాజకీయాలు చేసేవాళ్లను తుదముట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదని.. హత్యలు చేయడం దుర్మార్గమైన పని అని అన్నారు. హత్య కేసును ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదన్నారు. రాజకీయ కోణం, వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేక పోవడం లాంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నేరస్తులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. వీరయ్య చౌదరి మంగళవారం రాత్రి హత్యకు గురికాగా… నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు రేషన్ బియ్యం తరలించే మాఫియాకు చెందినవారిగా పోలీసు వర్గాలు చెబుతున్నారు. గతంలో వాసు అనే బియ్యం వ్యాపారిని వీరు హత్య చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా ఆ కారణంగానే వీరయ్య చౌదరి సైతం హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
వీరయ్య చౌదరి హత్య అనంతరం ఒంగోలుకు చెందిన ఓ రేషన్ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి కనిపించకుండా పోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడితో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఒంగోలకు తరలిస్తున్నారు.ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని వీరయ్య చౌదరి నివాసానికి చేరుకుని అతని మృతదేహానికి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించి… వారికి పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
వీరయ్య చౌదరి కత్తులతో 53 సార్లు పొడిచి హత్య చేశారని చంద్రబాబు తెలిపారు. వీరయ్యను చంపిన హంతకులను శిక్షిస్తానని తెలిపారు. ఇప్పటికే నిందితులను గుర్తించేందుకు 12 బృందాలను నియమించామని… అవసరమైతే మరిన్ని బృందాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు రాజకీయ, వ్యాపారం సహా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నేరం చేసిన వారిని వదిలిపెట్టమని.. చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని చెప్పారు.