పూర్తి కాని వెలిగొండ ను జాతికి అంకితం చేసిన జగన్ ను జనం క్షమించరు.
• వెలిగొండ పూర్తవ్వలేదనే నిజాన్ని వైసిపి నేతలు అంగీకరిస్తున్నారు.
• పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన జగన్ కు సిగ్గుందా?
• ప్రకాశం జిల్లా ప్రజలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
మంత్రి నిమ్మల రామనాయుడు డిమాండ్.
అధికారం కోల్పోయినా అబద్దాలు ఆడటంలో వైఎస్సార్సిపి నేతలు, ఆపార్టీ అధినేత జగన్మోహాన్ రెడ్డి ఎక్కడా తగ్గడంలేదు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు. ప్రజలను ఏమార్చడానికి, అబద్దాలు ఆడటానికి వైఎస్సార్ సిపి నేతలు ఒకరినొకరు పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో వెలిగొండ కు 3వేల కోట్లు కేటాయించాలని వైసిపి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతున్నారంటే, వెలిగొండ పూర్తవ్వలేదనే నిజాన్ని వారు అంగీకరిస్తున్నారని తెలిపారు.
పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశాడో సమాధానం చెప్పాలి అని ఆయ డిమాండ్ చేశారు. తండ్రి శంఖుస్దాపన చేస్తే, కొడుకు పూర్తి చేశాడని, ప్రచారం చేసుకుని, సంబరాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. అబద్దాలను మర్చిపోయి, నేడు బడ్జెట్ లో కేటాయింపులు గురించి వైఎస్సార్ సిపి నేతలు, ఏముఖం పెట్టుకుని అడుగుతున్నారని విమర్శించారు. వెలిగొండ పూర్తయినా టిడిపి ప్రభుత్వం నీరివ్వట్లేదని, మీ అసత్య, అవినీతి పత్రిక లో అబద్దాలు రాయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అబద్దానికి హద్దులు ఉండవు, కానీ అబద్దాలు మాట్లాడేవాళ్ళకు కూడా అపారమైన జ్ఞాపక శక్తి ఉండాలి. లేకపోతే జగన్ లానే అభాసుపాలవుతారని హితవు పలికారు. పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడానికి, జాతికి అంకితం చేయడానికి జగన్ కు సిగ్గు ఉందా అని ఆయన అన్నారు.
పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగా, జాతికి అంకితం అంటూ, మోసం, దగా చేసిన జగన్, ప్రకాశం జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలిగొండ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి నీళ్ళందించడానికి వీలుగా, హెడ్ రెగ్యులేటర్, రెండో టన్నెల్ లైనింగ్, బెన్సింగ్ పనులు, టన్నెల్ లో ఉన్న 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు, ఫీడర్ కెనాల్ వాల్, లైనింగ్ పనులు, టన్నెల్ లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులు అన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. నల్లమలసాగర్ రిజర్వాయర్ కు నీరు తరలించేందుకు వీలుగా ముందు ఆర్అండ్ఆర్ కు వేయికోట్లు రూపాయలు నష్ట పరిహారం అందించడంతో పాటు, నిర్వాసితులకు పునరావాస కాలనీలు సైతం నిర్మించి, 2026 జూలై కల్లా రిజర్వాయర్ ను కృష్ణా జలాలతో నింపి, ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పని చేస్తాం అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.