విడదల రజనీ. టీడీపీ నుంచి జంప్ చేసి వైసీపీలోకి వచ్చిన నాయకురాలు. ఆమె చిలకలూరిపేట నుంచి 2019లో జగన్ వేవ్ లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. దాంతో ఆమె స్టేట్ వైడ్ లీడర్ అన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది. నిజానికి విడదల రజనీకి అంత బలం ఉందా స్థాన బలం ఏ మేరకు ఉంది. ఆమె రాజకీయ పరపతి పలుకుబడి వైసీపీకి ఎంత మేరకు ప్లస్ అయ్యాయి అన్నది వైసీపీలోని వారే ఆలోచించుకోవాల్సి వస్తోంది.
వైసీపీ పుట్టిన నాటి నుంచి అందులో ఉన్న వారు మర్రి రాజశేఖర్ వంటి వారు. పునాది నుంచి ఉన్న వారు ఇపుడు పార్టీని వీడిపోయారు. టీడీపీలో విడదల రజనీ ఉన్నపుడు వైసీపీ అధినాయకత్వాన్ని చాలా ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఆమెను చేర్చుకుని అందలాలు అందించడమే వైసీపీలో స్పెషాలిటీ అని అంటున్నారు. ఇక ఆమె ఎమ్మెల్యే అయ్యాక వైసీపీలో వర్గ పోరుకు నాంది పలికారు అని అంటారు. పార్టీలో ముందు నుంచి ఉన్న వారు తన గెలుపునకు సహకరించిన వారిని ఆమె సైడ్ చేయడంతోనే చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని అంటారు.
ఇక ఆమె మంత్రి అయ్యాక అనుసరించిన విధానాలు దూకుడు వంటి వాటి మీద చర్చ ఉండనే ఉంది. ఆమె హయాంలో అక్రమాలు జరిగాయని టీడీపీ ప్రభుత్వం ఒక వైపు కేసులు పెడుతోంది. ఆమె హయాంలో జరిగిన అవకతవకలను ఒక్కోటీ వెలికితీస్తున్నారు. ఇక ఆమె అధికారంలో ఉన్నపుడు బాధితులం అయ్యామని అంటున్న వారికి ఇపుడు టీడీపీ అండగా ఉండటంతో ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో ఆమె కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విడదల రజనీ మాత్రం తన మీద పెడుతున్న కేసులు అన్నీ రాజకీయ కక్షతోనే అని అంటున్నా ఆధారాలు ఉన్నాయని కూటమి పెద్దలతో పాటు అంతా అంటున్నారు.
అనూహ్యంగా మంత్రిగా అవకాశం రావడంతో ఆమె రాజకీయగా దూకుడు చేశారని అంటున్నారు. ఆమె అనుచరులు ఆమె వర్గం అంతా కూడా చిలకలూరిపేటనే కాదు మొత్తం పల్నాడు జిల్లాలోనే చక్రం తిప్పారని అంటున్నారు. ఆమె సమీప బంధువులు పీఏ కలెక్షన్ల పర్వానికి తెర తీశారు అన్న విమర్శలు ఉన్నాయి.అలాగే బదిలీలు ప్రమోషన్లలో విపరీతంగా అవినీతి ఆ రోజులలో జరిగింది అని అంటున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో అడ్డగోలు నియామకాలు చేపట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక స్టోన్ క్రషర్ యజమాని ఒకరిని బెదిరించి రెండు కోట్ల రూపాయలు పైగా వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇవే కాదు రైతులు కొందరికి ప్రభుత్వం సొసైటీగా ఏర్పడితే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ సాగు భూముల మీద వైసీపీ పెద్దల కన్ను పడడంతో ఆ భూములకు రేటు ఫిక్స్ చేసి మరీ వారికి రైతుల నుంచి విక్రయించేలా చేయడంతో మాజీ మంత్రి వర్గీయుల పాత్ర కీలకంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జగనన్న కాలనీల పేరిట రైతుల నుంచి భూములు తీసుకుని ప్రభుత్వం కట్టిన రేటు కంటే తక్కువ మొత్తాన్ని వారికి చెల్లించి నోట్లో మట్టి కొట్టారన్న దాని మీద వారంతా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు అనేక వివాదాలు అనేక విషయాలలో మాజీ మంత్రి పేరు రావడం ఆమె మీద కేసులు పెడుతున్నారు. దాంతో ఆమె అరెస్ట్ తప్పదని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఇంత జరిగినా వైసీపీ విడదల రజనీని మోయాలా అన్న చర్చ కూడా సాగుతోది. ఆమె వల్ల పార్టీకి ఎంత మేరకు లాభం అన్న చర్చ కూడా చేసేవారు ఉన్నారు. బలమైన నాయకులను ఎంతో మందిని కేవలం ఆమె కోసం వదులుకోవడం ద్వారా వైసీపీ ఇప్పటికే భారీ ఎత్తున రాజకీయ మూల్యం చెల్లించింది అని అంటున్నారు. ఇపుడు ఆమెను వెనకేసుకుని వైసీపీ వస్తే కనుక ఆ తప్పులను మోయడం తప్ప వేరొకటి కాదని అంటున్నారు. ఒక విధంగా పార్టీ ఇమేజ్ ని ఫణంగా పెట్టి ఇదంతా చేయాలని అంటున్నారు. వైసీపీ అయితే ఏమి ఆలోచిస్తోందో తెలియదు కానీ పేటలో ఉన్న వైసీపీ నేతలు క్యాడర్ మాత్రం ఈ విషయంలో పార్టీ గమ్మున ఉంటే వాస్తవాలు అవే బయటకు వస్తాయని అంటున్నారుట. మొత్తానికి విడదల రజనీ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆమె వెనక వెళ్ళి వైసీపీ కూడా చిక్కుల్లో చిక్కుకుంటుందా అన్నదే చర్చగా ఉంది.
మాజీ మంత్రి, విడదల రజిని ప్రస్తుత పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె ప్రస్తానాన్ని చూస్తే.. అంతా వివాదాలమయంగానే ఉంటుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా, జిల్లా స్థాయిలో కొందరితో ఆమె రాజకీయ శతృత్వం ఏర్పరుచుకుందున్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఆ నాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుతో ఆది నుంచి రజనీతో ఘర్షణ పూరిత వాతావరణం ఉందని నిన్నటి పరిణామాలు తేటతెల్లం చేశాయి. ఎమ్మెల్యేగా తన విజయంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌తో కూడా ఆమె సఖ్యతగా ఉండలేకపోయారు. ఎన్నికల వరకు బాబాయ్ అంటూ మర్రితో ఉండి ఎమ్మెల్యే పదవిలోకి రాగానే రజని యూ టర్న్ ఎందుకు తీసుకుంది?, ఘర్షణ పూరిత వాతావరణం వచ్చిందో పార్టీ వర్గాలు కూడా అంచనా వేయలేక పోయాయి.
సోమేపల్లి సాంబయ్య అల్లుడిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ల పాటు అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్, వైసీపీ జెండాను మోసి నియోజకవర్గంలో క్యాడర్ ను కాపాడిన మర్రితో రజనీ రాజకీయ వైరం పెట్టుకోవటం ఆమె రాజకీయ పరిణితిని చిలకలూరిపేట లో రాజకీయ సీనియర్లు అప్పట్లోనే పసిగట్టారు. ఇది ప్రధానంగా విడదల రజని రాజకీయ తప్పిదంగా ఆ పార్టీ వారే భావిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇద్దరు తొట్టి గ్యాంగ్ జర్నలిస్టులు, ఆమెకు దగ్గరై వివాదాల రాజకీయ నాయకురాలిగా చర్చించుకునే దుస్థితికి కారణమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కూడా రజనీ దూరం చేసుకున్నారని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం.
ఎన్నికల సమయంలో రజనీ గుంటూరుకు మారిన తర్వాత, ఆమె సూచించిన మల్లెల రాజేష్ నాయుడుకు వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు. ఆ సమయంలో మర్రి రాజశేఖర్‌ను ఆయన కలవడం ఇష్టం లేక, కావటి మనోహర్ నాయుడును రంగంలోకి దింపారు. దీంతో రాజేష్ నాయుడు తన అనుచరులతో టీడీపీలో చేరి పోయారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, రజనీ తన పీఏలను అడ్డం పెట్టుకొని భారీగా వసూళ్లు భారీగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ అవినీతి ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. త్వరలో అరెస్టు లు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.
కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటానని రజనీ చెబుతూనే, ఎంపీ కృష్ణదేవరాయల వద్దకు రాయబారం పంపిందన్న వార్తలు వైసీపీలోనే దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆమె గురించి కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికైనా రాజకీయ వైఖరి మార్చుకుంటే చిలకలూరిపేటలో వైసీపీ మనుగడ ఉంటుందని లేకుంటే కష్టమేనని స్థాయిలో రజనీ పూర్తి స్థాయిలో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు.