కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వెల్లడించారు.
కాకినాడ పోర్టు వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారని విజయసాయి అన్నారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగానే విక్రాంత్ రెడ్డి తనకు తెలుసని సీఐడీ అధికారులకు తాను చెప్పానని అన్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా కేవీ రావును విక్రాంత్ రెడ్డికి పరిచయం చేశానని తెలిపారు. పోర్టు యజమాని కేవీ రావుతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ను కాపాడేందుకు మీరంతా యత్నిస్తున్నారా? అని సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని… ఈ కేసుతో జగన్ కు సంబంధం లేదని తాను చెప్పానని తెలిపారు.
కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని విజయసాయి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్లినా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన ఒక రాజభవనంలో ఉండేవారని చెప్పారు. పోర్టు వ్యవహారంతో జగన్ కు సంబంధం లేదని అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పారు.
ఆది నుంచి అంతం వరకు పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే అని కామన్ ఫ్రెండ్స్ తో కేవీ రావు చెప్పారని తెలిపారు. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని… సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. కేవీ రావు రాజకీయ బ్రోకర్ అని… ఆయనంటే తనకు అసహ్యమని చెప్పారు.
తాను వ్యవసాయం చేసుకుంటున్నానని… ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని విజయసాయి చెప్పారు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేదని… ఇప్పుడు దేవుడిపై భక్తి ఉందని అన్నారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని… తాను ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. భవిష్యత్తులో తనపై విమర్శలు, ఆరోపణలు చేసినా తాను పట్టించుకోనని అన్నారు.
స్నేహంగా ఉన్నంతకాలం.. స్నేహితుల మధ్య ఏ తప్పులూ కనిపించవు. అదే స్నేహం విరిగిపోతే.. ఒప్పులు కూడా తప్పుల లాగానే కనిపిస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపులు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిని చెప్పుకోవచ్చు. తాజాగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకుంటారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో నాకు స్థానం లేదని తెలిసి వైసీపీ నుంచి బయటకు వచ్చాను. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపాయి.