• రాయలసీమ అభివృద్ధి వైసీపీకి ఇష్టం లేదు.
• అభివృద్ధి జరిగితే అవినీతిని ప్రశ్నిస్తారని వారికి భయం.
• అన్ని ప్రాజెక్టులకు అడ్డు తగిలేది అందుకే..
హంద్రీనీవా ఎత్తిపోతలకు సంబంధించి బుధవారం శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు సంబంధించి వైకాపా సభ్యుడు అసలు లైనింగే వద్దు అనగానే జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. మీకు లైనింగే కాదు రాయలసీమ అభివృద్ధి కూడా అవసరం లేదు. రాయలసీమ ప్రాంత ప్రజలు అభివృద్ధిచెంది, బాగుపడితే మీ అవినీతి వైకాపా పాలనను ఎక్కడ ప్రశ్నిస్తారోనని, భయపడుతున్నారని విమర్శించారు.
అందుకే మేము చేసే అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ, అసంబద్ధ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలకు అబద్ధాలు నూరి పోస్తున్నారు అంటూ ఘాటుగా విమర్శించారు. ఐదేళ్లపాటు హంద్రీనీవా వైపు కన్నెత్తి చూడని తాడేపల్లి రాజప్రసాదం, పరదాలకు పరిమితమైన వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్నలు, పనులు చేస్తున్న మమ్మల్ని అడగటం విడ్డూరంగా ఉందని నిమ్మల ఎద్దేవా చేశారు.
హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేసి 6,200 క్యూసెక్కుల నీరు వదలాలని ఉత్తుత్తి జీవో ఇచ్చి పైసా పని కూడా చేయకుండా వదిలేసిన అప్పటి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. లైనింగ్ తప్పు అంటున్న మీరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తే అది ఎలా ఒప్పుఅవుతుంది. అధికారంలో ఉంటే ఒకలా, అధికారం కోల్పోతే మరోలా, మాట్లాడటం వైకాపా మేధావులకు సబబు కాదు అని నిమ్మల చురకలంటిoచారు. 2019 నాటికే చంద్రబాబు ఏర్పాటు చేసిన 3850 క్యూసెక్కుల సామర్ద్య పంపులను కూడా ఉపయోగించి, నీరు తీసుకురాలేని వైసిపికి, హంద్రీనీవా పై మాట్లాడే అర్హత లేదన్నారు.
జగన్ పాలనలో గాలేరు-నగరి కెనాల్ కు లైనింగ్ చేశారు. ఆనాడు దాన్ని వ్యతిరేఖించని వైకాపా అనుకూల మేధావులు, నేడెందుకు హంద్రీనీవా పై మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్దికోసం కాదా? అంటూ ప్రశ్నించారు.
జగన్ పాలనలో ఓ పెద్ద మంత్రి గండికోట నుంచి పైపుల ద్వారా ఏకంగా చిత్తూరు జిల్లాకు గాలేరు-నగరి నీరు తరలించాలని పని చేశారు. దీని వల్ల భూగర్భ జలాల సమస్య వస్తుందని వైకాపా మేధావులకు ఎందుకు తెలియ రాలేదు. ఎందుకు ప్రశ్నించలేదని నిమ్మల ధ్వజమెత్తారు. తెలుగు గంగ నిర్మాణ సమయంలో హక్కు జలాలా? వరద జలాలా? అంటూ, కుతర్కం లేవదీసి ఎన్టీఆర్ పై దాడి చేసిన సంగతి ప్రజలు మరువ లేదన్నారు. జగన్ పాలనలో నిధులు ఇవ్వకుండా రాయలసీమ ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నారు.
నేడు రాయలసీమలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్, చంద్రబాబు పూర్తి చేసినవే నని నిమ్మల పునరుద్ఘాటించారు. 798 అడుగుల నుంచి నీరు తీసుకునే మచ్చుమర్రి లిఫ్ట్ ను చంద్రబాబు ప్రారంభిస్తే, దాన్ని జగన్ నిర్లక్ష్యం చేశాడు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో జల జగడం పెట్టారు. దానివల్ల కృష్ణా, తుంగభద్ర గోదావరి జలాలపై ఏపికి ఉన్న ప్రత్యేక హక్కులు కేంద్రం చేతుల్లోకి వెళ్ళాయని ఈ పాపం మీది కదా అంటూ నిమ్మల ఆవేదన చెందారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అభివృద్ధి పనులపై లేనిపోని అపోహలు కల్పించి ఆ పనులు ఆగిపోయేటట్టు చేయటం వైకాపా రాజకీయ దుర్నీతికి, దిగజారుడుతనానికి నిదర్శనమని నిమ్మల మండి పడ్డారు.
రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీనీవా పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అందువల్లనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర బడ్జెట్లో కనీ విని ఎరుగని రీతిలో 3240 కోట్లు కేటాయించారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. కర్నూలు, అనంతపూర్ చిత్తూరు జిల్లాల్లోని హంద్రీనీవా పరివాహక నియోజకవర్గాలన్నిటికి నీరు ఇచ్చి తీరుతామన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ కు లైనింగ్ చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని చెరువులు నిండి భూగర్భ జల సంపద వృద్ధి చెందుతుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.