రామ్ లీలా మైదానంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వేదికపై ఉన్న ఎన్డీఏ మిత్రపక్ష నాయకులను అభివాదం చేస్తూ వెళ్లిన (Pawan kalyan )మోదీ, పవన్ వద్దకు రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే, మోదీ ముఖంలో కనిపించిన చిరునవ్వు, పవన్ తో జరిగిన ఆ క్షణిక సంభాషణలో హిమాలయాల ప్రస్తావన రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.
మోదీ, పవన్ ను చూస్తూనే నవ్వుతూ, “ఏంటి, అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?” అని సరదాగా ప్రశ్నించారట. దీనికి పవన్ కూడా చమత్కారంగా స్పందిస్తూ, “ఇంకా అలాంటి ఆలోచన లేదు, ముందు ఇవన్నీ చూసుకోవాలి” అని జవాబిచ్చినట్లు తెలిపారు. ఈ మాటల మధ్యలో ఇద్దరూ నవ్వుకున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంలో బీజేపీ ఢిల్లీలో సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ పవన్, “ఇది మోదీ నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానం. ఇలాంటి చరిత్రాత్మక విజయం మళ్లీ మళ్లీ రావడం సాధ్యం కాదు. దేశమంతా మోదీపై ఉన్న విశ్వాసాన్ని ఈ ఫలితం ప్రతిబింబిస్తుంది” అని వ్యాఖ్యానించారు. పవన్ మాటలు ఆయన రాజకీయ స్థిరతపైనే కాక, కేంద్ర రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యతను కూడా చూపిస్తున్నాయి.
సాధారణంగా రాజకీయ సమావేశాల్లో ఇలాంటి అనధికారిక సంభాషణలు పెద్దగా బయటకు రావు. కానీ, హిమాలయాల ప్రస్తావనతో మోదీ, పవన్ మధ్య చర్చకు అందరి దృష్టి వెళ్లింది. ఇది కేవలం సరదా సంభాషణ మాత్రమేనా? లేక భవిష్యత్తులో ఏదైనా సంకేతమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తంగా, ఈ హిమాలయాల ముచ్చట రాజకీయ వర్గాల్లో కొత్త వాదనలకు వేదికయింది.
దేశ రాజధాని హస్తినలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలో ఉండటంతో ప్రత్యేక దుస్తులతో ఈ కార్యక్రమంలో కనిపించారు.
ప్రధాని మోదీ వేదికపైకి రాగానే అక్కడున్న నేతలను పలకరించారు. తొలుత గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఆ తరువాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు నమస్కరిస్తూ ముందుకు సాగిన మోదీ, ఆ తర్వాత మహారాష్ట్ర మరో డిప్యూటీ సీఎం ఏక్‌నాధ్ షిండేను పలకరించారు. ఆ తర్వాత ఫడ్నవీస్‌తో పాటు మిగతా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు నమస్కరించుకుంటూ ముందుకుసాగిన మోదీ.. పవన్ కళ్యాణ్ కనిపించగానే ఒక్కనిమిషం పాటు అలా ఆగిపోయారు.
పవన్ వస్త్రాదారణ చూసిన మోదీ నవ్వుతూ హిమాలయాలకు వెళ్దామనుకుంటున్నావా అంటూ చమత్కరించారు. మోదీ మాటలకు పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్ అలా ఏమి లేదంటూ సమాధానమిచ్చారట. వెంటనే నీ ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి.. వాటిని చూసుకో అంటూ మోదీ పవన్ కళ్యాణ్ చేతిలో చేయి వేసి పలకరించారు. మోదీ మాటలకు పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం నవ్వుతూ కనిపించారు.
వేదికపై ఉన్నవారందరికి నమస్కరిస్తూ ముందుకుసాగిన మోదీ పవన్ వద్ద కొద్దిసేపు ఆగి.. ప్రత్యేకంగా మాట్లాడటంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌పై మోదీ మరోసారి తన అభిమానాన్ని చూపించారంటూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.
వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వస్త్రధారణ చూసి పీఎం మోదీ సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పోరాడుతుందని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా హిందూ ఆలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక సనాతన బోర్డు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ను పవన్ వినిపిస్తున్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సినీ నటుడిగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. రాజకీయంగానూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పవన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ(Modi) పవన్ కళ్యాణ్ చేతుల్లో చేతులు కలిపి ప్రత్యేకంగా ముచ్చటించడం జాతీయ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది.