”టన్నెల్‌లో మనుషుల జాడ ఇంకా కనిపించలేదు, నిన్న గుర్తించినది ఎక్విప్‌మెంట్ మాత్రమే. అవసరమైతే రోబోలతో రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేస్తాం.”
”పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల, ఇవాళ అది కుప్పకూలి 8 మంది ప్రాణాలు పోయినయ్.”
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వేర్వేరు ప్రకటనలు ఇవి. గంటల వ్యవధిలోనే ఆయన ఈ రెండు వేర్వేరు ప్రకటనలు చేశారు.
అంతకుముందు, ప్రమాదం జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను సందర్శించి, అధికారులతో సమీక్షించిన అనంతరం, రేవంత్ రెడ్డి అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు.
”టన్నెల్‌లో మనుషుల జాడ ఇంకా కనిపించలేదు, నిన్న గుర్తించినది ఎక్విప్‌మెంట్ మాత్రమే. రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి మరో రెండుమూడు రోజుల సమయం పట్టొచ్చు, అవసరమైతే రోబోలను పంపి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేస్తాం. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ”పదేళ్లుగా పడావున్న(పెండింగ్‌లో ఉన్న) ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోవడం వల్ల, ఇవాళ కుప్పకూలి 8 మంది ప్రాణాలు పోయినయ్” అని వ్యాఖ్యానించారు.
సభలో గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ”పదేళ్లలో ప్రాజెక్టులు కడితే పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తి చేయలేదు? బీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదు? ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయింది?” అని ప్రశ్నించారు.
”ఆ నాడు మేం(కాంగ్రెస్ ప్రభుత్వం) ఎస్‌ఎల్‌బీసీ మొదలుపెట్టి 32 కిలోమీటర్లు మేం పూర్తి చేస్తే, మీ పదేళ్ల పాలనలో మిగిలిన 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు పడావు పెడితే, పదేళ్లుగా పడావున్న ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పకూలి 8 మంది ప్రాణాలు పోయినయ్” అన్నారు.
అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం పనులు జరుగుతుండగా, ఫిబ్రవరి 22 ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన మరుసటి రోజు, ఫిబ్రవరి 23వ తేదీ, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది.
బుధవారం రాత్రి నాటికి, లోపలికి వెళ్లేందుకు దారి ఏర్పరిచి పరిస్థితిని అంచనా వేసుకున్నారు.
సహాయ చర్యలకు ఆటంకం కలగకుండా, సహాయ చర్యలలో పాల్గొనే వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ తర్వాత టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
యంత్రాన్ని కట్ చేసి, అడ్డంగా ఉన్న సామగ్రిని, మట్టిని, బురదను తొలగించారు.
గురువారం నుంచి సహాయ చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయ చర్యలలో కీలకంగా వ్యవహరించాయి.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ), ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రైల్వేలు వంటి మిగిలిన సంస్థలు కూడా సహాయక చర్యలలో తమవంతు సాయం అందించాయి.
ఎక్కడైతే మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారో, ఎక్కడైతే మట్టి మెత్తగా ఉందో ఆ ఐదు ప్రాంతాలను ఎన్జీఆర్ఐ తీసుకొచ్చిన మెషీన్ సహాయంతో గుర్తించి తవ్వారు. అక్కడే మృతదేహాలు దొరకొచ్చని భావించారు.
ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి సొరంగం లోపల చిక్కుకుపోయిన వారిలో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఇంతకుముందే తెలంగాణ మంత్రి ఒకరు చెప్పారు.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు.
దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలుకాగా, 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు మొదలై ఇంకా కొనసాగుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో రూ. 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది.
ప్రాజెక్టుకు అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయగా.. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్) మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది.
రెండుచోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది.