ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 200 సేవలు అందిస్తున్నామని.. ఈ నెలాఖరుకు మరో 150 సేవలు అందబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వివరించారు. ఈ నెలాఖరుకు మొత్తంగా 350 సేవలు, అనంతరం మొత్తంగా 500 సేవలకు విస్తరిస్తామని భాస్కర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను పెద్దఎత్తున ఉపయోగించి ‘‘వన్ స్టేట్.. వన్ యాప్’’ విధానంలో ప్రజలందరికీ ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేయాలని సూచించారు. ఈ దిశగా అధికారులు కూడా కృషి చేయాలని ఆదేశించారు. డిజిటల్ అక్షరాస్యత పెరిగితే.. వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించడమూ పెరుగుతుందని సీఎం చెప్పారు. పీపుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎ్‌సపై సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించడంతో పాటు.. ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సదుపాయం గురించి ప్రజలకు వివరించాలన్నారు. నిరక్షరాస్యులు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తమ ఫిర్యాదులు ప్రభుత్వానికి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, జిల్లా కలెక్టర్లందరూ ఈ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయిలో కూడా వాట్సాప్ సేవలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. డేటా లేక్ అనుసంధాన ప్రక్రియ కూడా వేగవంతంగా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తమ ఫోనులో వా ట్సాప్ ద్వారా సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు.
అన్న క్యాంటీన్‌లలో భోజనం చాలా బాగుందన్న ఫీడ్‌బ్యాక్ వస్తోందని.. క్యాంటీన్‌లలో తింటున్నవారు సంతృప్తి చెందుతున్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్న క్యాంటీన్ నిర్వహణపై 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఎం ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈవో మాధురి తదితరులు పాల్గొన్నారు.