ఐదారేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి పెద్దయెత్తున పంటను సాగు చేశారు. అయితే, అనూహ్యంగా ఈ ఏడాది ధరలు తగ్గిపోయాయగుంటూరు మిర్చి యార్డులో గతేడాది క్వింటాల్ రూ.25 వేలు పలికిన మిర్చి ధర, ఈ ఏడాది కనీసం రూ.11 వేలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
మిర్చి రైతుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వ వినతులతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద క్వింటాల్‌కు రూ. 11,781 రూపాయలిస్తామని వెల్లడించింది.కానీ, ఈ ధర ఏ మాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. క్వింటాల్ మిర్చికి కనీసం రూ.20 వేలు వస్తే గానీ నష్టాల నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు.
ఈ ఏడాది సాగు దశలో మిర్చి పంటకు చీడపీడలు, నల్లి అధికంగా అంటుకోవడంతో పురుగు మందులు ఎక్కువగా వాడామని, దాంతో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు.క్వింటాల్‌కు రూ.10 వేలు, రూ.11 వేలు కూడా రాకపోతే పొలం యజమానికి ఏం కట్టాలనేది కౌలు రైతుల ఆందోళన.
గత ఐదారేళ్లుగా మిర్చికి మార్కెట్‌లో మంచి ధరలే వస్తుండటంతో రైతులు ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించి పెద్దమొత్తంలో పంట వేశారు.గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలకు ఎగుమతయ్యేది.
అయితే, ఇటీవల ఎగుమతులు తగ్గడంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి.చైనాకు ఆర్డర్లు పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ఆ మేరకు ఫలితం కానరాలేదు.
మిర్చి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయి రైతుల ఆందోళన నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద సేకరణ పరిమితులను పెంచాలని కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి చతుర్వేదితో కూడా ఆయన దిల్లీలో సమావేశమయ్యారు.ఆ తర్వాత స్పందించిన కేంద్రం, వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చికి 11,781 రూపాయల ధరను ఇస్తామని ప్రకటించింది.
గతంలో లేని విధంగా ఇప్పుడు విదేశాల్లో కూడా మిర్చి సాగు చేస్తున్నారు. దాంతో ఎగుమతులు తగ్గుతున్న పరిస్థితిల్లో మిర్చి మార్కెట్ అంతగా లేదని భావిస్తే పాలకులు రైతులను అప్రమత్తం చేయాలి. లేదంటే, అప్పులే పెట్టుబడిగా పెట్టి సాగు చేసే రైతు చివరికి కన్నీళ్ల పాలయ్యే పరిస్థితి ఉంటుంది.
కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ప్రకటించిన ధరపై రైతులు అసంతృపిగా ఉన్నారు. దీన్ని పాలకులు గమనించాలి. అసలు ఇప్పటి వరకు ఆ స్కీం విధి విధానాలు, ఏ క్వాలిటీకి ఆ ధర చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. మార్కెట్‌లో మిర్చి ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోతున్నాయనే దానిపై అధికారులు దృష్టిసారించాలి.
మార్కెట్‌లో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 341 రకం మిర్చి ధర రూ.15 వేలు పలుకుతోంది. తేజా రకం కూడా రూ. 14 వేల వరకు వెళ్తోంది. ఇంకా రేట్లు పెరిగే అవకాశమున్నందున రైతులు కంగారు పడొద్దు” అని గుంటూరు మిర్చి యార్డు అధికారులు చెబుతున్నారు.