భారతీయ పురాణేతిహాసం రామాయణం కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాక, మళ్లీ అదే కథతో సినిమా తీస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు నితీష్ తివారీ. దంగల్ లాంటి ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ ని ఇచ్చిన నితీష్ ఇలాంటి ప్రయత్నం చేస్తుండడం, అతడితో రణబీర్ కపూర్ లాంటి స్టార్ కలవడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలేర్పడ్డాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తోంది. ఇందులో దిగ్గజ తారలు కీలక పాత్రల్లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి.
అయితే రామాయణంలో అత్యంత కీలక పాత్ర అయిన రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రధాన విలన్ రావణాసురుడి పాత్రపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ప్రచారం సాగుతున్నా, అందులో ఎలాంటి నిజం లేదని తాజాగా స్పష్ఠత వచ్చింది. కేజీఎఫ్ యష్ పై ప్రారంభంలో కేవలం ఫోటోషూట్ మాత్రమే చేసారు. ఆ తర్వాత అతడు ఎలాంటి సన్నివేశాల్లోను నటించలేదు. ఎట్టకేలకు యష్ చిత్రబృందంతో చేరబోతున్నారని తెలుస్తోంది. మరో వారంలో ముంబైలో రామాయణం పార్ట్ 1 షూటింగ్‌లో యష్ పాల్గొనబోతున్నాడు. రావణుడి పాత్రపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఈ పౌరాణిక ఇతిహాసంతో తన ప్రయాణానికి శుభారంభం కోసం యష్ మొదట ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి దైవిక ఆశీర్వాదం పొందుతాడని తెలుస్తోంది.
ఏదైనా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభిస్తుంటే యష్ కచ్ఛితంగా దేవాలయాలను సందర్శిస్తాడు. రావణాసురుడు మహాదేవ్ భక్తుడు కాబట్టి యష్ తప్పనిసరిగా ఆలయాన్ని సందర్శించి దైవం ఆశీస్సులు తీసుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నమిత్ మల్హోత్రాతో కలిసి యష్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ భారీ పెట్టుబడులు పెడుతోంది. యష్ ఈ ఫ్రాంఛైజీకి సహనిర్మాతగా కొనసాగుతున్నారు. ఎట్టకేలకు ఏప్రిల్ చివరి నుండి తన సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించనున్నాడు. మరోవైపు యష్ నటించిన టాక్సిక్ 19 మార్చి 2026న విడుదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కన్నడం, ఇంగ్లీష్ లో తెరకెక్కించిన ఈ సినిమాని దక్షిణాది అన్ని భాషలు సహా హిందీలోను అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. ఎమోషనల్ కంటెంట్ తో సినిమాలు అందించే అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.