రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదు అన్నారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. తనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చారని అందుకు ధన్యుడిని అని ఆయన మాట్లాడుతున్నారు తన బాధ్యతలు అయిపోగానే తిరిగి మఠానికి అంటున్నారు.ఈ విధంగా మాట్లాడడం చాలా మందికి సాధ్యం కాదు సగటు రాజకీయ నాయకుడికి అసలు సాధ్యం కాదు. యోగీ ఆదిత్యనాథ్ ని సగటు రాజకీయ నేతగా చూడాలా అంటే ఆయన గత పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా పనిచేశారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఆయన విషయంలో అయితే బీజేపీలో చాలా ఆశలు ఉన్నాయి. ఆయన ఇంకా ఎత్తులకు ఎదగాలని అనుచరులు కోరుకుంటున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి చాలు అని దండం పెట్టేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వారసుడు మీరా అని అడిగితే దానికి కూడా కానే కాదు నేను ఏమిటో నాకు తెలుసు అని అంటున్నారు. యోగి మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నది చర్చగా ఉంది. ఆయన హిందూత్వకి ఫైర్ బ్రాండ్. ఆయన లాంటి వారే కావాలని బీజేపీలో అతి వాద వర్గానికి ఉంది. ఆర్ఎస్ఎస్ కి అయితే యోగి మీద ఎంతో అభిమానం నమ్మకం ఉన్నాయి. మోడీ ద్వారా మూడు సార్లు కేంద్రంలో బీజేపీకి అధికారం దక్కింది.ఏ కారణం చేత అయినా మోడీ ఇమేజ్ తగ్గి బీజేపీకి ఇబ్బంది వస్తే కనుక ఆ ప్లేస్ లోకి యోగిని తీసుకుని రావాలని ఆర్ఎస్ఎస్ ఆలోచన అని ప్రచారంలో ఉంది ఆర్ఎస్ఎస్ మొదటి ఆప్షన్ యోగీ అనే అంటారు. మోడీ వారసుడు అంటే యోగీకే ఓటు వేస్తారని కూడా చెబుతున్నారు.
పైగా యూపీ వంటి పెద్ద స్టేట్ కి సీఎం గా రెండు సార్లు చేసిన యోగీకి ఇక దక్కాల్సింది ప్రధాని పదవి మాత్రమే అని అంటున్నారు. రాజకీయంగా చూసినా చిన్న వయసులో ఉన్న యోగీకి ఎందుకీ రాజకీయ వైరాగ్యం అని అంతా అంటున్న నేపథ్యం ఉంది.అయితే రాజకీయాల్లో కాదంటే అవును అనిలే అన్న మాట కూడా ఉంది. యోగీ ఈ రోజున సీఎం గా ఉన్నారు. మరో రెండేళ్ళ పాటు ఆయనకు ఈ పదవి ఉంది. ఇక ప్రధాని పదవి అయితే ఖాళీగా లేదు మోడీ అక్కడ ఉన్నారు. ఆయన పదవీ కాలం మరో నాలుగేళ్ళు ఉంది. ఏతా వాతా ఏమైనా చూసుకుంటే కనుక బీజేపీలో ప్రధాని పదవికి పోటీ పడటం అన్నది. 2029 నాటి మాట అని అంటున్నారు. అప్పటికి అంటే చాలా టైం ఉంది అందుకే ఈ రోజు నుంచే నేనే పోటీ నేనే మోడీకి వారసుడిని అని యోగీ చెప్పుకోవడం వల్ల లాభం కంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి చెందిన ఎంతో మంది సీఎంలు ఉంటే వారిలో ప్రజాకర్షణ కలిగిన సీఎం గా యోగీకే ఎంతో పేరు ఉంది. జాతీయ స్థాయిలోనూ ఆయన గురించి మారుమోగుతుంది.
మోడీకి వారసుడు అన్న మాట వచ్చినపుడల్లా అంతా యోగీ వైపే చూస్తున్నారు. దాంతో ఆయనకు ఉన్న స్థానం ఏమిటో అందరికీ తెలుస్తోంది. అందుకే తానుగా ఏమీ కోరుకోవడం లేదని చాలా జాగ్రత్తగానే యోగీ మాట్లాడుతున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే యూపీ సీఎం పదవిని కూడా ఆయన ఏమీ కోరుకోలేదు. అది ఆయనకు ఒకటికి రెండు సార్లు దక్కింది. అందువల్ల ఆయన ప్రధాని కావాలని రాసిపెట్టి ఉంటే కనుక అదే జరిగి తీరుతుంది అని అంటున్నారు. అందుకే యోగీ నా రాజకీయం ఫుల్ టైం కాదని లౌక్యంగానే చెబుతున్నారు అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.