వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా కాలానికి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంతే కాదు పరిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడులో ఆయన అడుగుపెడుతున్నారు. నిజానికి ఇది పరామర్శగా చెబుతున్నా టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజుకున్న రాప్తాడులో జగన్ రాక మాత్రం మరింత వేడిక్కించే అని అంటున్నారు.
జగన్ రాప్తాడులో బీసీ నేత లింగమయ్య దారుణ హత్య తరువాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను అని చెప్పారు. అందుకే ఆయన వస్తున్నారు. అయితే జగన్ ని రానివ్వకుండా చేయగలమని కానీ తమ కల్చర్ అలాంటిది కాదు అని మాజీ మంత్రి రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పరిటాల సునీత అన్నారు. వచ్చిన హెలికాప్టర్ లోనే జగన్ ని తిప్పి పంపించగలమని కూడా అన్నారు.
గతాన్ని కూడా ఆమె ముందుంచారు. పరిటాల రవీంద్ర పులివెందుల వెళ్తే ఆయన వాహనాలను మూడింటే అనుమతించి అడ్డుకున్నారని ఆమె ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చారు. తాము అలాంటి వారం కాదని అంటూనే దివంగత నేత పరిటాల ప్రస్తావన తేవడం నిజంగా ఆయన అభిమానుల్లో వేడిని రాజేయడమే అని అంటున్నారు. ఇటీవల కాలంలో పరిటాల రవి ప్రస్తావన ఆమె తరచూ చేస్తున్నారు. ఆయన హత్యలో జగన్ ప్రమేయం ఉందని కూడా విమర్శించారు. ఇక రాయలసీమలో కొన్ని అసెంబ్లీ నియోజకర్గాలలో ఫ్యాక్షన్ కక్షలు గతంలో ఉండేవి. ఇపుడు అంతా సర్దుకుంటున్న నేపధ్యం ఉంది. మరి జగన్ టూర్ నేపధ్యము రాప్తాడులో అయితే రాజకీయం రచ్చగానే ఉంది. జగన్ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి సాయం చేతనైతే చేసి తిరిగి వెళ్ళాలని పరిటాల సునీత కోరుతున్నారు.
బీసీల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా రాప్తాడు వస్తున్న జగన్ రాప్తాడు ఎమ్మెల్యే టికెట్ ని బీసీలకు ప్రకటించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇలా బీసీ కార్డుతోనే అటూ ఇటూ మాటల యుద్ధం సాగుతోంది. బీసీల పార్టీ టీడీపీ అని ఆమె అంటే మా బీసీ నేతను చంపేశారు అని వైసీపీ ఆరోపిస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ వైపు నుంచి ఉండరాదని కచ్చితంగా ఆమె చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ క్యాడర్ సంయమనంతో ఉండాలని కోరారు ఇవన్నీ చూస్తూంటే జగన్ టూర్ తో రాప్తాడులో ఏమి జరుగుతుంది అన్న చర్చ వస్తోంది. రాప్తాడులో అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పాలిటిక్స్ ధీటుగా ఉంది. 2014లో పరిటాల సునీత గెలిస్తే 2019లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. 2024లో సునీత మళ్ళీ గెలిచారు ఇలా ఢీ అంటే ఢీ కొడుతున్న ఈ రాజకీయం ఇపుడు వైసీపీ అధినేత పర్యటన క్రమంలో ఏ విధంగా మారుతుంది అన్న చర్చ అయితే ఉంది.