వైసీపీలో సర్వ సత్తాక అధికారాలు అన్నీ వైఎస్ జగన్ కే దగ్గర ఉన్నాయి. జగన్ తోనే పార్టీ ఉంది. ఆయనతోనే ముందుకు సాగుతుంది. అలాంటి పార్టీలో జగన్ కాకుండా వేరొకరికి పగ్గాలు అందుతాయా అది సాధ్యమేనా అంటే రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే అని అంటారు.ఆ మాటకు వస్తే రాజకీయమే అంతా. అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవడమే పాలిట్రిక్స్ అని చెబుతారు. ఇంతకీ వైసీపీలో ఏమి జరుగుతోంది ఎందుకిలాంటి చర్చలు వస్తున్నాయి అంటే జగన్ బలమైన నాయకుడే. కానీ ఆయన మీద ఉన్న కేసులు ఇంకా బలమైనవి అని అంటున్నారు.
జగన్ మీద 2012లో సీబీఐ పెట్టిన క్విడ్ ప్రోకో కేసులు ట్రయల్ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఇవి తొందరలోనే ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు ఈ కేసులలో తీర్పు ఎలా ఉంటుంది అన్నది ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. అయితే న్యాయవాది కూడా అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలే ఇపుడు వైసీపీలోనూ చర్చకు తావిస్తున్నాయి. ఈ కేసులలో కనీసంగా రెండు నుంచి మూడేళ్ళ దాకా జగన్ కి శిక్ష పడవచ్చు అని అంటున్నారు. అంటే ఈ కేసులలో తీర్పు ఒక సంచలనం గానే ఉంటుందని ఆయన ముందే ఊహిస్తున్నారు అన్న మాట. ఈ నేపథ్యంలో అదే కనుక జరిగితే కనీసంగా రెండేళ్ళకు మించి శిక్షలు పడిన వారు ఎన్నికల్లో ఆరేళ్ళ పాటు పోటీకి అనర్హులు అని చెబుతున్నారు.
అంటే అదే కనుక జరిగితే జగన్ 2029 ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారు అని అంటున్నారు ఇదే ఇపుడు వైసీపీలోనూ హాట్ టాపిక్ గా ఉంది అని అంటున్నారు ఉండవల్లి ఈ విధంగా వ్యాఖ్యానించారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఇక ఈ కేసులే కాదు ఇపుడు లిక్కర్ కేసు కూడా ముందుకు వస్తోంది. లిక్కర్ కేసు విషయంలో కూడా సీరియస్ గానే వ్యవహారం సాగితే ఇందులో సైతం జగన్ కి ఇరికిస్తే కనీసంగా రెండేళ్ళకు మించి శిక్షలు పడేలా ఉండొచ్చు అని అంటున్నారు.
ఇలా పాత కొత్త కేసులలో ఏదో ఒక దానిలో జగన్ కి అయితే రెండేళ్ళకు మించి శిక్షలు పడేలా రాజకీయంగా తెర వెనక పావులు వేగంగా కదుపుతున్నారని అంటున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా వైసీపీకి సర్వం జగన్ మాత్రమే. ఎందరు పార్టీలో ఉన్నా పోయినా జగన్ అన్న వారు ఉంటే చాలు ఆ పార్టీ లేచి కూర్చుంటుంది. ఏపీలో రాజకీయం తీరు చూస్తే ఎంత బాగా పనిచేసినా అయిదేళ్ళకు ఒక మారు అధికారం నుంచి తప్పించి మరో పార్టీకి చాన్స్ ఇస్తున్నారు దాంతో 2029 నాటికి వైసీపీ ఆశలు బలంగానే ఉన్నాయి. కానీ ఈ కేసుల చికాకు ఏమైనా అసలుకే ఎసరు తెస్తున్నా అన్న ఆందోళన కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కనుక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో పోటీకి దూరంగా జరిగినా లేక మరో విధంగా జరిగినా ఆయన సతీమణి వైఎస్ భారతికి పగ్గాలు అప్పగిస్తారు అని చర్చ సాగుతోంది. ఆమెను ముందు పెట్టి రాజకీయం చేయవచ్చు అని అంటున్నారు.
వైసీపీలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతోంది అన్నది ముందే ఊహించిన వారు ఉద్ధండ పండితులు అనదగిన వారు జగన్ కి నీడ లాంటి వారు అందుకే ముందే తప్పుకుని వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై అని సంచలన ప్రకటనలు ఇచ్చారని అంటున్నారు. అలాగే మరికొందరు కీలక నేతలు పార్టీని వీడడానికి ఇలాంటి చర్చలే కారణం అని అంటున్నారు. జగన్ చుట్టూ అల్లుకున్న పార్టీగా ఉన్న వైసీపీలో జగన్ ప్రత్యర్ధులకు పెద్ద ఎత్తున టార్గెట్ అవుతున్నారని అంటున్నారు. దాంతో ఆయనను రాజకీయంగా ఇబ్బందులు పెడితే వైసీపీ భవిష్యత్తు ఏమి అవుతుందో అన్నది కూడా ఆలోచించుకునే ముందు జాగ్రత్తపరులు వైసీపీ గేటు దాటారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఈ ఏడాదిలోనే సరికొత్త రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. అలాగే రాజకీయ సంచలనాలు నమోదు అవుతాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ పుకార్ల లాంటి ప్రచారంలో నిజమెంత ఉందో అన్నది.